రాసలీలల ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ జనసేనలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జనసేన సీనియర్ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబును పృథ్వీరాజ్ కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నాయకుడిగా జగన్ ముఖ్యమంత్రి కావాలని పృథ్వీ కోరుకున్నారు.
సినిమా పరిశ్రమ నుంచి వైసీపీ మద్దతుదారుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు వుండేది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పృథ్వీని గుర్తించుకుని ఎస్వీబీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే భక్తి చానల్ చైర్మన్ బాధ్యతల్ని చిలిపి పృథ్వీరాజ్‌కు అప్పగించడంపై అప్పట్లో విమర్శలొచ్చాయి. అయినా ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కొన్ని రోజులకే రాసలీలల్లో పృథ్వీరాజ్ మునిగితేలారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ మహిళతో సరస సంభాషణ పృథ్వీ పదవికి ఎసరు పెట్టింది.
భక్తి ఉన్న చోట రక్తి ఉంటుందని పృథ్వీ అనుకున్నారే గానీ, ప్రభుత్వం మాత్రం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆయన్ను తక్షణం ఎస్వీబీసీ చానల్ నుంచి తప్పించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వైసీపీకి వ్యతిరేకంగా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నారు.
జగన్‌ను వ్యతిరేకిస్తుండడంతో ఆయన గత చిలిపి ప్రవర్తనను ఒక వర్గం మీడియా పట్టించుకోవడం లేదు. వైసీపీ నాయకుడిగా మెగా కుటుంబంపై అవాకులు చెవాకులు పేలానంటూ పృథ్వీ క్షమాపణలు కూడా చెప్పారు.
తాజాగా ఆయన నాగబాబును కలవడంతో మరోసారి రాజకీయ ప్రస్థానంపై చర్చ జరుగుతోంది. త్వరలో జనసేనలో చేరనున్నట్టు సమాచారం. “రాసలీలల ఆరోపణలపై వైసీపీ సస్పెండ్ చేస్తే, జనసేన ఆదరిస్తోంది. శభాష్. ఒకే స్వభావం ఉన్నవాళ్లంతా ఒక గూటికే చేరుతున్నారు” అని వైసీపీ నేతలు సెటైర్లు విసురుతున్నారు. రాసలీలల రాజ్… ఇక జనసైనికుడు అంటూ నెటిజన్లు వ్యంగ్య కామెంట్స్ పెడుతున్నారు.