విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహాన్ని బహిరంగంగానే ప్రదర్శించారు. దీంతో చంద్రబాబు అవాక్కయ్యారు. ఇందుకు దేశ రాజధాని ఢిల్లీ వేదికైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో పాల్గొనేందుకు చంద్రబాబు శనివారం ఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయంలో చంద్రబాబుకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు, కేశినేని నాని తదితరులు స్వాగతం పలికారు.
గల్లా జయదేవ్‌తో చంద్రబాబు మాట్లాడుతుండగా కేశినేని విష్ చేశారు. దీన్ని చంద్రబాబు చూడలేదు. అయితే తాను విష్ చేసినా చంద్రబాబు స్వీకరించలేదని, ఆయన మనసులో తనపై కోపం ఉందని కేశినేని నాని ఫీల్ అయ్యినట్టున్నారు. ఎందుకంటే ఇటీవల విజయవాడలో తన సోదరుడిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తూ, తనను పక్కన పెడుతోందని కేశినేని ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే టీడీపీ అధిష్టానంతో కేశినేని నాని చర్చల తర్వాత అంతా సర్దుకుందని అనుకున్నారు. ఇటీవల కేశినేని నాని ఇంట్లో శుభకార్యానికి చంద్రబాబు, లోకేశ్ కుటుంబ సమేతంగా వెళ్లారు. వారందరినీ నాని కుటుంబ సభ్యులు ఆప్యాయంగా ఆహ్వానించారు. దీంతో టీడీపీపై నాని అసంతృప్తి పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో సొంత పార్టీ ఎంపీ షాక్ ఇచ్చారు. చంద్రబాబుకు గౌరవంగా బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ సీనియర్ సభ్యుడైన కేశినేని నాని చేతికి ఇవ్వబోయారు. అప్పటికే బాబుపై తీవ్ర కోపంతో ఉన్న కేశినేని నాని ఆ బొకేని విసురుగా తోసి తన నిరసనను బాహాటంగానే వ్యక్తం చేశారు. నాని ప్రవర్తనకు చంద్రబాబు నిశ్చేష్టుడై… నిస్సహాయంగా కళ్లప్పగించి చూస్తుండి పోయారు.