తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల స్థాపించారు. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. మరో 18 నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడు జంపింగ్‌లు మొదలయ్యాయి. కానీ షర్మిల పార్టీ అంటూ ఒకటి వుందని, అందులోకి వెళ్లాలని ఏ ఒక్క నాయకులు ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చివరికి వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితులుగా పేరు పొందిన కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా షర్మిల పార్టీ గురించి అసలు పట్టించుకోవడం లేదు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన అన్న ఎంపీ వెంకటరెడ్డి కూడా ఊగిసలాటలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నాయకులంతా బీజేపీలోకి వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారు. అలాగే బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులు టీఆర్ఎస్లోకి వెళుతున్నారు. బీజేపీ, టీఆర్ఎస్లలో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.
తెలంగాణలో రాజకీయాలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నాయి. వాటిని దాటుకుని వైఎస్సార్టీపీ వరకూ చేరలేదు. నిజానికి తెలంగాణలో వైఎస్సార్టీపీ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందని అందరూ భావించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌లోని అసంతృప్తవాదులంతా షర్మిల పార్టీలోకి క్యూ కడతారనే ప్రచారం జరిగింది. కానీ ఆ పని జరగకపోగా, అంతా బీజేపీ వైపు చూస్తున్నారు.
తెలంగాణాలో తాజా రాజకీయాలను గమనిస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ అసమ్మతి నాయకులంతా బీజేపీ వైపు తప్ప, ఇతర పార్టీల వైపు చూడటం లేదు. రెడ్డి సామాజిక వర్గ కాంగ్రెస్ నేతలు, వైఎస్సార్ కుటుంబంపై అభిమానం ఉన్న నేతలు కూడా కాంగ్రెస్ ను వదిలి బీజేపీ వైపు మాత్రమే వెళుతున్నారు. దీంతో తెలంగాణలో షర్మిల పార్టీకి భవిష్యత్ ఉందనే నమ్మకం లేకపోవడం వల్లే ఇతర పార్టీల్లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. అలాగే నిరుద్యోగుల సమస్యలపై ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేస్తున్నారు. అయినా తెలంగాణ ప్రజానీకం నుంచి షర్మిల పార్టీకి తగిన ఆదరణ లభించలేదు. ఏదో చిన్న స్థాయి నాయకులు అక్కడక్కడ షర్మిల పార్టీలో చేరుతున్నారు. అంతకు మించి నియోజకవర్గ స్థాయి నాయకులెవరూ షర్మిల పార్టీ వైపు కన్నెత్తి చూడడం లేదు.
పార్టీని బలోపేతం చేసుకోడానికి షర్మిల శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఏదో ఒక ప్రజాసమస్యపై ఆమె పోరాడుతూనే ఉన్నారు. అయినప్పటికీ తగిన ఫలితం రావడం లేదు. షర్మిలను ఆంధ్రా బిడ్డగానే చూస్తుండడం వల్ల రాజకీయంగా ఆదరించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షర్మిల మాత్రం తన ప్రయత్నాల్ని విరమించడం లేదు. కష్టపడితే ఏదో ఒక రోజు ప్రజలు తప్పక ఆదరిస్తారనే నమ్మకంతో ఆమె ముందుకెళుతున్నారు.