వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం “పీఠ”ముడి వీడలేదు. నేడు పీఠాధిపతి విషయమై ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్న తరుణంలో మళ్లీ వ్యవహారం మొదటికొచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి శివైక్యం చెందడంతో, ఆయన వారసుడెవరనే విషయమై సమస్య ఉత్పన్నమైంది. పెద్ద భార్య కుమారులు తమకే కావాలని, కాదు కాదు తమకే దక్కాలని చిన్న భార్య మారుతి మహాలక్షుమ్మ పట్టుబట్టడంతో సమస్య జఠిలమైంది.
ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు వర్గాలుగా విడిపోయి విమర్శలు, ప్రతివిమర్శలతో ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా కొందరు పెద్ద మనుషులు, కుల పెద్దలు చర్చోపచర్చలు నిర్వహిస్తున్నారు.
ఈ చర్చలు ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చాయని సమాచారం బయటికొచ్చింది. దీంతో బ్రహ్మంగారి భక్తులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో… రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ మీడియాతో మాట్లాడుతూ షాక్ ఇచ్చారు.
బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా వీరభోగ వసంత వేంకటే శ్వరస్వామి పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రిస్వామి, ఉత్తరాధికారిగా రెండో కుమారుడు వీరభద్రస్వామిని ఎంపిక చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె మీడియా సాక్షిగా ఖండించారు. అలాగే భవిష్యత్ వారసులుగా తాము అంగీకరించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె తేల్చి చెప్పారు. దీంతో పీఠాధిపతి ఎంపీకలో మళ్లీ గందరగోళం నెలకుంది.
మారుతి మహాలక్షుమ్మ మీడియాతో మాట్లాడుతూ తనతో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చర్చించలేదన్నారు. పెద్ద భార్య కుమారులు పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా అంగీకరించామనడం అవాస్తవమన్నారు. అసలు వారితో తాను చర్చలే జరపలేదన్నారు. కేవలం పెద్ద భార్య కుటుంబ సభ్యులు మాత్రమే చర్చించుకున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడితే తప్పక చర్చలకు వెళ్తానన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే, దేవాదాయశాఖ అధికారులతో చర్చించిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆమె తేల్చి చెప్పారు. దీంతో సమస్య కొలిక్కి వచ్చిందని అంతా భావించిన సమయంలో, మహాలక్షుమ్మ ట్విస్ట్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.