సోనూ సూద్ కోసం 700 కిలోమీటర్ల పాదయాత్ర.. రామ్ చరణ్ కోసం 231 కిలోమీటర్ల పాదయాత్ర… హీరోయిన్ రష్మిక కోసం 900 కిలోమీటర్ల యాత్ర.. అల్లు అర్జున్ కోసం 200 కిలోమీటర్లు నడక..
ఇటీవల కాలంలో ట్రెండింగ్ టాపిక్స్ ఇవి. అభిమాన తారల్ని కలుసుకునేందుకు షార్ట్ కట్ ఇదే అని భావించారు ఫ్యాన్స్. అందుకే లాంగ్ మార్చ్ కి సిద్ధమయ్యారు. ఏకంగా వందల కిలోమీటర్లు నడిచి వస్తున్నారంటే వారి తపన అర్థం చేసుకోవచ్చు.
తన అభిమాన నటుడు ముంబైలో ఉన్నాడని తెలిసి హైదరాబాద్ నుంచి కాలినడక 700కిలోమీటర్లు నడచి వెళ్లి కలిసొచ్చాడు సోనూ సూద్ ఫ్యాన్ వెంకటేష్. షూటింగ్ కోసం సోనూ సూద్ హైదరాబాద్ వచ్చినప్పుడు కలవొచ్చు కదా అంటే, తన దేవుడ్ని దర్శించుకోవడం కోసం పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నానని, అందుకే అలా నడచి వెళ్లానని అని చెప్పుకొచ్చాడు.
ఇక రామ్ చరణ్ విషయానికొస్తే.. ముగ్గురు వీరాభిమానులు జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి నడుచుకుంటూ హైదరాబాద్ వచ్చారు. వీరి సాహసానికి ముచ్చటపడిన రామ్ చరణ్ ముగ్గుర్నీ ఇంట్లోకి పిలిచి కాసేపు వారితో ముచ్చటించాడు. అభిమానికి చరణ్ ఇచ్చిన మెగా ఆలింగనం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.
అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని మాచర్ల నుంచి నడక ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న బన్నీ, మధ్యలోనే అతడి పాదయాత్రను ఆపి, నేరుగా తన ఇంటికి తీసుకొచ్చాడు. ఫొటోలు దిగి, షేక్ హ్యాండ్ తో పాటు.. ఓ చిన్న మొక్క ఇచ్చి తిరిగి పంపించాడు.
హీరోల కోసమే కాదు, హీరోయిన్ కోసం కూడా సాహసాలు చేసేవారున్నారు. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రష్మిక కోసం హైదరాబాద్ కి చెందిన ఆకాశ్ త్రిపాఠి అనే యువకుడు ఏకంగా బెంగళూరు వెళ్లాడు. లాక్ డౌన్ టైమ్ లో ప్రయాణానికి ఎలాంటి వాహనాలు లేకపోవడంతో కొంతదూరం కాలినడకన, మరికొంత దూరం లారీలలో వెళ్లాడు ఆకాశ్ త్రిపాఠి.
తీరా అతను బెంగళూరు చేరుకునే సరికి రష్మిక అక్కడ లేదు. ఆమె ముంబైలో మకాం పెట్టింది. రష్మిక ఇంటి అడ్రస్ కోసం వెదుకుతున్న యువకుడ్ని చూసి పోలీసుసలు అనుమానించారు. అసలు విషయం తెలుసుకుని షాకయ్యారు. కౌన్సెలింగ్ ఇచ్చి హైదరాబాద్ కి తిప్పి పంపించేశారు.
ట్రెండ్ మారింది..
అభిమాన తారల ఫొటోలు సేకరించడం, పోస్టర్లు గోడ మీద అతికించడం, వారి సినిమా విశేషాలు సేకరించి పుస్తకాలు తయారు చేయడం ఒకప్పటి ట్రెండ్. సోషల్ మీడియా వచ్చాక తారల తరపున ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లు తెరిచి వారి విశేషాలను పోస్ట్ చేయడం, ఫ్యాన్స్ అకౌంట్ గా మంచి పబ్లిసిటీ తెచ్చుకోవడం ఇప్పటి ట్రెండ్.
ఇప్పుడు కొత్తగా ఈ పాదయాత్ర ట్రెండ్ మొదలైంది. ఏకంగా వందల కిలోమీటర్లు నడిచి వచ్చేస్తున్నారు అభిమానులు. వారిని డిజప్పాయింట్ చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. అందుకే ఈ పాదయాత్రికుల్ని అభిమానంతో దగ్గరకు తీస్తున్నారు హీరోలు. వీరిని ఇన్స్ పిరేషన్ గా తీసుకుని మరికొంతమంది యాత్రికులు తయారైతే మాత్రం కష్టం.