డబ్బున్నోళ్ల పుట్టినరోజు వేడుకలు శృతిమించిపోతున్నాయి. కేక్ కట్ చేసి, భోజనాలు పెట్టే రోజులు పోయాయి. బర్త్ డే పార్టీల పేరిట రేవ్ పార్టీలు, డ్రగ్స్, నైట్-అవుట్స్ కామన్ అయిపోతున్నాయి. మొన్నటివరకు మెట్రోలకే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా వ్యాపిస్తోంది. తాజాగా గుంటూరులో ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది. తన పుట్టినరోజు కోసం ఓ వ్యక్తి, ఏకంగా కాల్ గర్ల్స్ ను రప్పించాడు.
గుంటూరు జిల్లా అరండల్ పేటకు చెందిన ఓ వ్యక్తి స్థానిక హోటల్ లో పుట్టినరోజు పార్టీ ఇచ్చాడు. బర్త్ డే పార్టీని మరింత ''రసవత్తరంగా'' మార్చేందుకు, అతడి స్నేహితులు ఏకంగా బెంగళూరు నుంచి కాల్ గర్ల్స్ ను రప్పించారు. అంతా కలిసి హోటల్ లో ''పార్టీ'' చేసుకోవడం స్టార్ట్ చేశారు.
అయితే ఇలాంటి విషయాలు దాచినా దాగవు. ఆనోటా ఈనోటా పోలీసుల చెవిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, హోటల్ పై దాడులు నిర్వహించారు. పుట్టినరోజు వేడుకల్లో గానాభజానా చేస్తున్న ముగ్గురు కాల్ గర్ల్స్ తో పాటు అందర్నీ అదుపులోకి తీసుకున్నారు.
కేసు ఫైల్ చేసి, అమ్మాయిల్ని పునరావాస కేంద్రానికి తరలించారు పోలీసులు. బర్త్ డే బాయ్ తో పాటు అతడి స్నేహితుల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కేవలం కాల్ గర్ల్స్ తోనే ఆగారా.. లేక రేవ్ పార్టీ లాంటిదేమైనా జరిగిందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. హోటల్ సిబ్బందిని కూడా కొంతమందిని అదుపులోకి తీసుకొని, హోటల్ పై కూడా కేసు నమోదుచేశారు.