మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు టాలీవుడ్‌లో రాజకీయ వేడిని రగుల్చుతున్నాయి. పరస్పరం వర్గాలుగా విడిపోయి కౌంటర్లు, ఎన్‌కౌంటర్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు నరేశ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనంతా బయట పెట్టారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయని ఆయన చెప్పడం గమనార్హం.
తన ప్యానల్‌ని పరిచయం చేస్తూ విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కౌంటర్‌గా శనివారం ‘మా’ అధ్యక్షుడు నరేశ్ మీడియా ముందుకొచ్చారు. నరేశ్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘శుక్రవారం ప్రకాశ్‌రాజ్.. తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ, ప్రస్తుతం జనరల్ బాడీలో ఉన్న సభ్యులే తమ పదవీ కాలం ముగియక ముందే ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో చేరారు.
నిన్నటి సమావేశంలో వారు కనిపించడం చూసి మేమంతా షాకయ్యాం. అదే సమావేశంలో నటుడు నాగబాబు మాట్లాడుతూ.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయి. ఆయన నాకు ఆప్తమిత్రుడు. అలాంటిది నాగబాబు.. ‘మా’ మసకబారిపోయిందని వ్యాఖ్యానించడం తప్పు’ అని నరేశ్ చెప్పుకొచ్చారు.
‘మా’తరపున తాము చేసిన చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెప్పామన్నారు. అయినా కూడా నాలుగేళ్లుగా 'మా' మసకబారిపోయిందని నాగబాబు అనడం షాక్‌కు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు కథలు చెప్పడం అలవాటు లేదన్నారు. కాగితాలతో రావడం అలవాటు లేదన్నారు. ఎవర్నో ధూషించడానికో, ఎవరిపైనో కాలు దువ్వడానికో ఈ సమావేశం పెట్టలేదని చెప్పడం గమనార్హం.