మంత్రి పదవి హామీని జగన్ కామెడీగా మార్చారు. ఇంకా మంత్రి పదవి హామీలిస్తుంటే జనం నమ్ముతారని జగన్ ఎలా అనుకుంటున్నారో అనే ప్రశ్న వినిపిస్తోంది. కుప్పం వైసీపీ కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ….‘మూడేళ్లుగా భరత్ చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. భరత్‌కు ఒక్కసారి తోడుగా నిలబడి గెలిపించుకుని రండి. మంత్రిని చేస్తాను. కుప్పం అభివృద్ధికి మరింతగా ఉపయోగపడతాడు’ అని జగన్ నమ్మబలికారు.
నిజానికి కుప్పంలో వైసీపీ బాగా బలపడింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు వైసీపీది వాపు కాదు, బలమే. ఎందుకంటే వైసీపీ బలపడడానికి జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే కారణం. కుప్పంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అణగారిన సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువ. రెక్కాడితేగానీ డొక్కాడని బలహీనవర్గాల ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఇంత కాలం వారి అమాయకత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయంగా సొమ్ము చేసుకుంటూ వచ్చారు.
అయితే జగన్ రాజకీయ పంథా వేరు కదా! ప్రధాన ప్రతిపక్ష నాయకుడినే ఓడిస్తే ఓ పనై పోతుందని పంతం పట్టారు. దీంతో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఇందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం తోడైంది. పేదలకు సంక్షేమ పథకాలన్నీ ఏ లోపం లేకుండా అందడం వల్ల మెజార్టీ ప్రజానీకం లబ్ధి పొందుతున్నారు. దీంతో తమకు జగనే కావాలనే భావన కుప్పం ప్రజానీకంలో పెరుగుతూ వస్తోంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఈ నేపథ్యంలో కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎర వేశారు. ఈ సందర్భంగా గతంలో జగన్ హామీ ఇచ్చిన మంత్రి పదవుల జాబితా తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విడదల రజనీని గెలిపిస్తే… వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అలాగే అదే జిల్లాలోని మంగళగిరిలో చంద్రబాబు తనయుడు లోకేశ్‌ను గెలిపిస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. లోకేశ్‌ను జనం ఓడించారు. మరి జగన్ హామీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు?
ఆళ్ల రామకృష్ణారెడ్డికి రిక్త హస్తం చూపారు. మొదటి మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత పునర్వ్యస్థీకరించినా ఆళ్ల మంత్రి పదవికి నోచుకోలేదు. ఆళ్లకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై జగన్ విమర్శలపాలయ్యారు. మర్రి రాజశేఖర్‌కు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబును ఓడిస్తే భరత్‌కు మంత్రి పదవి ఇస్తానంటూ జనం చెవ్వుల్లో జగన్ పూలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఇచ్చిన మంత్రి పదవుల హామీలు నెరవేర్చని సంగతిని జనం మరిచిపోయి వుంటారని జగన్ నమ్ముతున్నారేమో!