మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు చకచకా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యే పదవికి కూడా స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేస్తానని ప్రకటించారు. మునుగోడుకు ఉప ఎన్నిక తథ్యమని ఆయన తేల్చి చెప్పారు. బీజేపీ తరపున టీఆర్ఎస్ను ఢీకొట్టేందుకు రాజగోపాల్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్దలతో చర్చించేందుకు ఇవాళ ఆయన ఢిల్లీకి పయనమయ్యారు. అయితే మునుగోడులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తన నియోజకవర్గ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరేందుకు రాజగోపాల్‌రెడ్డి ఆసక్తి చూపుతున్నారు.
ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో ఆయన మరోసారి చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరోసారి ఇతర పెద్దలతో చర్చించి బీజేపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనలో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. బీజేపీలో అధికారికంగా చేరడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా, ఆమోదం తదితర పనులన్నీ పూర్తయితే… మునుగోడు ఉప ఎన్నికకు సమాయత్తం కావాలని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారు.
మరో ఏడాదిన్నరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక కీలకం కానుంది.