‘మా’ రగడలో వర్మ పంచ్ లు

ఎక్కడ సందడి ఉంటే అక్కడ వాలిపోతాడు వర్మ. టాపిక్ ఏంటనేది ఈ దర్శకుడికి అనవసరం. జనాల దృష్టి ఎక్కువగా ఉన్న అంశంలో వేలు పెట్టామా.. కెలికామా.. ప్రచారం పొందామా అనేది మాత్రమే అవసరం. ఇప్పుడు…

ఎక్కడ సందడి ఉంటే అక్కడ వాలిపోతాడు వర్మ. టాపిక్ ఏంటనేది ఈ దర్శకుడికి అనవసరం. జనాల దృష్టి ఎక్కువగా ఉన్న అంశంలో వేలు పెట్టామా.. కెలికామా.. ప్రచారం పొందామా అనేది మాత్రమే అవసరం. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై కూడా వర్మ స్పందించాడు. ప్రకాష్ రాజ్ కు చెందిన లోకల్.. నాన్-లోకల్ ఇష్యూపై తనదైన శైలిలో ట్వీట్లు వేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.

“ముప్పై ఏళ్లుగా ప్రకాష్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి, పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని, అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ లోకలా?”

ఇలా ప్రకాష్ రాజ్ కు మద్దతుగా ఫ్రెష్ గా రంగంలోకి దిగాడు రామ్ గోపాల్ వర్మ. కర్నాటక నుంచి ఏపీకొచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే… ఎన్టీఆర్, ఏఎన్నార్ కూడా నాన్-లోకల్ కిందే లెక్క అంటున్నాడు.

“కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా? మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా?”

ఇలా తనదైన స్టయిల్ లో ట్వీట్లతో దంచికొట్టాడు వర్మ. ప్రకాష్ రాజ్ నటనను మెచ్చి దేశం అతడికి జాతీయ అవార్డులతో సత్కరించిందని, అలాంటి వ్యక్తిని నాన్-లోకల్ అనడం, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం లాంటిదే అంటున్నాడు.

ఎన్నడూలేని విధంగా ఈసారి తెలుగులో ట్వీట్స్ వేసి ఎట్రాక్ట్ చేశాడు వర్మ. చూస్తుంటే.. ఆ ట్వీట్స్ ఎవరో రాసి ఇచ్చినట్టున్నారు తప్ప, వర్మ కంపోజ్ చేసినట్టు కనిపించడం లేదు. ఎందుకంటే, తెలుగులో ట్వీట్స్ వేసేంత ఓపిక వర్మకు లేదు మరి.