ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించి చిన్న నెగెటివ్ అంశం దొరికినా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అవకాశంగా తీసుకుని రాజకీయ రాద్ధాంతం చేస్తుంది. అలాంటిది వైఎస్ జగన్ కేసులపై హైకోర్టు తనకు తాను సుమోటోగా విచారణ చేపట్టడంపై టీడీపీ నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
టీడీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పలు కేసులను మూసి వేస్తూ ఆయా మేజిస్ట్రేట్లు జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపడుతూ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ కమిటీ నిర్ణయం మేరకు సుమోటోగా హైకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
వైఎస్ జగన్ ప్రభుత్వం, న్యాయస్థానం మధ్య చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలను టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. ఏ మాత్రం రాజకీయ ప్రయోజనం కలుగుతుందని భావించినా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వెంటనే అందుకోవడం చూస్తున్నాం. ఈ విషయంలో అతి చేస్తే …నష్టమే తప్ప లాభం లేదని గ్రహించే నోరెత్తడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే టీడీపీ నేతలపై 28 కేసులను ఉపసంహరిస్తూ ఏకంగా 21 జీవోలు జారీతో పాటు మరో 131 కేసుల్లో విచారణ అర్ధంతరంగా ముగించిన ఘనత చంద్రబాబు పాలనకు దక్కిందనే వాస్తవం లోకానికి ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్‌పై చేపట్టిన సుమోటో విచారణ గురించి విమర్శలు చేయడం ద్వారా అనవసరంగా తన పాలనలో కేసుల ఎత్తివేత గురించి తనకు తానుగా బయట పెట్టుకున్నట్టువుతుందని టీడీపీ భావిస్తోంది. అయితే నిజం నిప్పులాంటిదంటారు. అది దాచేస్తే దాగేది కాదు.
టీడీపీ పాలనలో కేసుల ఉపసంహరణ, విచారణ ముగింపు గురించి ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందన్నది వాస్తవం. పైపెచ్చు టీడీపీ మౌనంతో ఏదో మతలబు ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి.