వయసులో పెద్దవాడు అయిపోవడంతో యువతరం మీద తను ఏదో సెటైర్ వేస్తున్నట్టుగా భావించి ఒక మాట మాట్లాడాడు ముఖేష్ ఖన్నా. 'శక్తిమాన్' రోల్ తో భారతీయులకు బాగా చేరువైన ముఖేష్ ఖన్నా, తన తాజా ఇంటర్వ్యూ ఒక దాంట్లో నటి సోనాక్షి సిన్హా మీద సెటైర్లు వేశాడు. డీడీ నేషనల్ లో రామాయణం, మహాభారతం వంటి టెలీ సీరియళ్లు పునఃప్రసారం కావడం గురించి ముఖేష్ స్పందిస్తూ, సోనాక్షి సిన్హా పేరును ప్రస్తావించాడు. అది పూర్తిగా అసందర్భమే!
ఆ టీవీ సీరియళ్లు మరోసారి ప్రసారం కావడం మంచిదే అని, తద్వారా సోనాక్షి సిన్హా వంటి వాళ్లకు రామాయణ, భారతంల గురించి తెలుస్తుందని.. పురాణజ్ఞానం అబ్బుతుందని ముఖేష్ ఖన్నా చెప్పుకొచ్చాడు! టీవీ మహాభారతంలో భీష్ముడి పాత్రను కూడా ముఖేష్ ఖన్నానే చేశాడు. ఆ సీరియళ్ల పునఃప్రసారం వల్ల ఈ తరానికి పురాణజ్ఞానం వస్తుందని అని ఉంటే సరిపోయేది. అయితే ముఖేష్ సోనాక్షి ప్రస్తావన ఎందుకు తెచ్చాడో, తెచ్చాడు.
అయితే ఈ విషయంలో ఆమె ఏమీ స్పందించలేదు. అయితే ఆమె తండ్రి ఊరికే ఉండలేదు. అసలు అతడు షాట్ గన్. 'అసలు ముఖేష్ ఎవరు? అతడేమైనా రామాయణ, భారతాల బ్రాండ్ అంబాసిడరా?' అన్నట్టుగా శత్రుఘ్నసిన్హా వ్యాఖ్యానించాడు. రామాయణం, భారతాల గురించి పూర్తిగా తెలిసిన వాళ్లే హిందువులు అవుతారా? అంటూ కూడా ఒక చురక అంటించాడు.
దీంతో శక్తిమాన్ వెనక్కు తగ్గాడు. తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పుకొచ్చాడు. తను ప్రత్యేకంగా సోనాక్షిని టార్గెట్ చేయలేదని అన్నాడు. యువతరానికి రామాయణ,భారతాల గురించి తెలుస్తుందని చెప్పడమే తన ఉద్దేశం అని ఈయన చెప్పుకొచ్చాడు. షాట్ గన్ గర్జించే సరికి ముఖేష్ స్పందించాడు. షాట్ గన్ కు వివరణ ఇచ్చుకున్నాడు. సోనాక్షి సిన్హా ఒక బిగ్ స్టార్ కూతురు కాబట్టి.. ఈ శక్తిమాన్ వెనక్కు తగ్గాడు.