అమెరికాలో హృదయ విదారకం

అగ్రరాజ్యం అమెరికా కరోనా విషయంలో తన హోదాను పోగొట్టుకుంది. ఈ వైరస్ ను అరికట్టలేక చేతులెత్తేసింది. ప్రస్తుతం అక్కడ హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతుండగా.. వెయ్యికి అటుఇటుగా…

అగ్రరాజ్యం అమెరికా కరోనా విషయంలో తన హోదాను పోగొట్టుకుంది. ఈ వైరస్ ను అరికట్టలేక చేతులెత్తేసింది. ప్రస్తుతం అక్కడ హృదయ విదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతుండగా.. వెయ్యికి అటుఇటుగా మరణాలు సంభవిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే అమెరికాలో 2,407 మంది కరోనా వల్ల మృత్యువాతపడ్డారు. అమెరికాలో ఒక రోజులో మరణించిన వారిలో ఇదే అత్యథికం.

నిన్న ఒక్క రోజే అమెరికాలో 26,945 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,13,886కు చేరింది. అటు నిన్నటికి యూఎస్ లో మరణాల సంఖ్య 26,945కు చేరుకుంది. అమెరికాలో అత్యథికంగా న్యూయార్క్ లో కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉంది. నిన్నటికి ఒక్క న్యూయార్క్ లోనే 11వేల మంది చనిపోయారు.

మరోవైపు అమెరికాలో పడకలకు, పీపీఈలకు, వెంటిలేటర్లకు కొరత లేదని అధికారులు ప్రకటించారు. ప్రతి రోగికి బెడ్ అందుబాటులో ఉందని, క్రిటికల్ పేషెంట్ల కోసం 16వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు. మరోవైపు అనుమానితులు తమకుతాముగా కరోనా పరీక్షను చేసుకునేలా పరికరాన్ని రూపొందించింది అమెరికా. రట్ గర్స్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ పరికరాన్ని ఉపయోగించి, లాలాజలంలో కరోనా క్రిములు ఉన్నాయో లేవో ఇంటి వద్దనే తెలుసుకోవచ్చు. తద్వారా అనుమానితులు హాస్పిటల్స్ వరకు రావాల్సిన అవసరం తగ్గింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షల మార్క్ దాటింది. ఈరోజు ఉదయం నాటికి వరల్డ్ వైడ్ 1,26,741 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. అటు ఇటలీలో 21,067 మంది, స్పెయిన్ లో 18,255 మంది, ఫ్రాన్స్ లో 15,729 మంది ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించారు.

జగన్ గారే దేశంలో నెం.1 ముఖ్యమంత్రి