గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవలకు కరోనా పాజిటివ్ గా తేలిందట. ఓ గుజరాత్ లో కరోనా కేసులు స్వల్ప స్థాయిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ఎమ్మెల్యేనే అక్కడ కరోనా పాజిటివ్ గా తేలాడు. అతడికి వైద్య చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో ఆ ఎమ్మెల్యే ఎవరెవరిని కలిశాడు, కరోనా క్యారియర్ గా ఎంతమందికి ఆ వైరస్ ను అంటించి ఉంటాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అంటే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చుట్టూ అనేక మంది ఉండనే ఉంటారు. మందీమార్బలానికి తోడు.. అనేక మంది ప్రముఖులతో కూడా ఆయన సమావేశం అయ్యే ఉంటాడు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఇటీవలి కాలంలో కొన్ని కీలక భేటీలకు కూడా హాజరైనట్టుగా తెలుస్తోంది.
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తో సమావేశానికి కూడా వెళ్లాడట ఆ ఎమ్మెల్యే. ఆ కార్యక్రమంలో ఇంకా పలువురు రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు కూడా పాల్గొన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో, అతడు ఇటీవలి కాలంలో కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వయంగా గుజరాత్ ముఖ్యమంత్రికే ఇప్పుడు కరోనా టెస్టులు తప్పేలా లేవు.
అయితే ఈ ప్రమాదం ఇంతటితో ఆగిపోలేదు. ఎమ్మెల్యే హోదాలోని ఇమ్రాన్ అనేక మందితో సమావేశం అయి ఉండొచ్చు, వారిలో ఎలాగూ ప్రముఖులు ఉండనే ఉంటారు. ఆ ప్రముఖులు ఇంకా అనేక మందితో సమావేశాలు అయి ఉండే అవకాశం ఉంది. ఇలాంటి క్రమంలో ఇమ్రాన్ ఎంతమందికి కరోనా వైరస్ ను అంటించి ఉంటాడు, వారి నుంచి మరెంతమందికి ఈ వైరస్ స్ప్రెడ్ అయి ఉంటుందనేది ఆందోళన కరమైన అంశంగా మారింది గుజరాత్ లో.