నమ్మే వాళ్లుంటే మోసగించే వాళ్లకు కొదవలేదు. అలాగని ప్రతిదీ అనుమానిస్తే బతకలేరు. విచక్షణతో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులుండవు. ప్రస్తుతం కరోనా విపత్తులో వ్యాక్సినేషన్‌కు డిమాండ్ ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు కేటుగాళ్లు సెలబ్రిటీలను టార్గెట్ చేసుకున్నారు.
ఇటీవల వ్యాక్సినేషన్ పేరుతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబును ఓ వ్యక్తి మోసగించాడు. రూ.లక్ష ట్రాన్స్ఫర్ చేయించుకుని పత్తా లేకుండా పోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిందితుడిని పట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా మరో సినీ, పొలిటికల్ సెలబ్రిటీ కూడా అదే రీతిలో మోసపోయారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తి కూడా నకిలీ మోసానికి గురయ్యారు.
తనను తాను ఐఏఎస్ అని చెప్పి, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా టీకా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దానికి మీ సహకారం కావాలని మిమిని కోరాడు. అతనితో పాటు కొందరు అధికారులు, భద్రతా సిబ్బంది కూడా ఉండడంతో ఆమె నమ్మారు.
టీకా వేయించుకున్నాక ఎంత సేపటికీ కొవిన్ నుంచి ధ్రువీకరణ సందేశం రాలేదు. దీంతో తాను మోసపోయానని ఆమె గ్రహించారు. వెంటనే కోల్‌కతా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.
కోల్‌కతా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నకిలీ ఐఏఎస్ కోసం వెతికారు. చివరికి అతన్ని పట్టుకుని, నిందితుని నుంచి కారుకు ఉపయోగించిన నకిలీ స్టిక్కర్లు, నీలిరంగు బేకాన్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి నకిలీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఇటీవల సంఘటనలు హెచ్చరిస్తున్నాయి.