అదేంటో గానీ జగన్ ప్రభుత్వం ఏం చేసినా తప్పే అన్నట్టుగా తయారైంది. చివరికి ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం కూడా న్యాయస్థానం మెట్లు ఎక్కిందంటే ఏమనుకోవాలి? ఇదే చంద్రబాబు హయాంలో ఒక్కటంటే ఒక్కదానిపైనైనా ఇలా జరిగిందా? అంటే కాదనే సమాధానం వస్తుంది.
అసలు చంద్రబాబు పాలనలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది దాదాపు లేనే లేదనే చెప్పాలి. ఒకవేళ ఆశ్రయిస్తే ఏమైంది? ఏమవుతుందనే అంశాలపై ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ప్రస్తుతానికి వస్తే ఎస్ఈసీ నియామకం విషయంలో జగన్ సర్కార్ హమ్మయ్య అంటూ ఊపిరి తీసుకుందనే చెప్పాలి. అయితే ఎస్ఈసీ నియామకంపై కోర్టులో విచారణ జరిగి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందనుకుంటే పొరపాటే. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ విరమణ అనంతరం జగన్ సర్కార్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నియమించింది.
ఇదే జగన్ సర్కార్ చేసిన అతి పెద్ద తప్పైంది. దీంతో ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వారం క్రితం విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ పిల్ దాఖలు చేశాడు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు లేకుండా పిల్ ఎందుకు వేశావని హైకోర్టు నిలదీసింది.
పిల్ దాఖలు చేయడమంటే తమాషైందని హైకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది. దీంతో మరిన్ని వివరాలు అందజేసేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో మరింత గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ గురువారం తన పిల్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయమై కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపాడు. దీంతో పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
నీలం సాహ్ని నియామకంపై విచారణ జరిగి ఉంటే ఏం జరిగేదో తెలియదు కానీ, అంత వరకూ పరిస్థితి వెళ్లకపోవడంతో ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకున్నట్టైంది.