రీవేంజ్ డ్రామాగా సాగి, క్లైమాక్స్ లో కోర్టు రూమ్ డ్రామాగా ఆకట్టుకునే సినిమా 'స్లీపర్స్'. అత్యున్నత స్థాయి నటనా ప్రమాణాలను సెట్ చేసే తారాగణం, ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగే కథకథనాలకు మించి ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేయడానికి మరేం కావాలి! ఆ కోవకు చెందిన సినిమానే 'స్లీపర్స్'. రాబర్ట్ డీ నీరో, డస్టిన్ హోప్మన్ వంటి ఆర్టిస్టులు తమకు కొట్టిన పిండిలాంటి పాత్రలను మరో రేంజ్ ప్రదర్శనతో, ప్రేక్షకుడిని ఆద్యంతం ఇన్ వాల్వ్ చేసే సీన్లతో స్లీపర్స్ ఆకట్టుకుంటుంది.
ఇది ఒక వాస్తవ కథ అని దీని రచయిత చెప్పుకున్నాడు. ముందుగా 'స్లీపర్స్' పేరుతోనే ఒక నవల వచ్చింది. దాన్నే సినిమాగా తెరకెక్కించారు. అయితే ఆ నవలలో, ఈ సినిమాలో పేర్కొన్నట్టుగా తమ దగ్గర ఎలాంటి కేసూ నమోదు కాలేదని మాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ ప్రకటించింది. అయితే ఈ కథలోని వాస్తవ వ్యక్తులు తర్వాత ఏమయ్యారో కూడా ఈ సినిమా ముగింపులో చూపించారు.
ఇంతకీ దీని కథేంటంటే..ముందుగా 1960లతో సినిమా ప్రారంభం అవుతుంది. న్యూయార్క్ సిటీలోని హెల్స్ కిచెన్ గా వ్యవహరించే ప్రాంతంలో.. చిన్న చిన్న ఆకతాయి పనులు చేసే నలుగురు కుర్రాళ్లు. వీరిని దారిలో పెట్టడానికి ప్రయత్నించే ఒక ప్రీస్ట్. వీరిని చిన్న క్రైమ్స్ కు వాడుకునే ఒక లోకల్ డాన్. ఆ నలుగరు కుర్రాళ్లూ మొదట్లో చేసేవి చిలిపి పనుల్లానే ఉంటాయి. అయితే ఆ ప్రాంక్స్ కాస్త హద్దు మీరడంతో వారు అనుకోని ప్రమాదంలో పడతారు.
హాట్ డాగ్స్ అమ్మే బండి వద్ద వారు దొంగతనం చేయబోయి, దాని ఓనర్ ను ఆటపట్టిస్తూ, ఆ బండిని ఒక సబ్ వే లోకి తోస్తారు. ఆ బండి ఒక వృద్ధుడిని తీవ్రంగా గాయపరచడంతో వీరిపై కేసు నమోదవుతుంది. విచారణలో వీరు దోషులుగా తేలతారు. వయసు రీత్యా వీరిలో పరివర్తన కోసం జువెనైల్ హోమ్ కు తరలిస్తారు. సినిమా మొత్తం ఆ నలుగురు కుర్రాళ్లలోని ఒక కుర్రాడు బ్యాక్ రౌండ్ నుంచి తమ కథను మొత్తం వివరిస్తూ ఉంటాడు.
తాము చిన్నదని చేసిన తుంటరి పని ఎంత తీవ్రంగా మారిందో, వీరిలో జైలుకు వెళ్లకు ముందే రియలైజేషన్ వస్తుంది. దొంగగా ఒక హాట్ డాగ్ తినడానికి వెళ్లి తాము ఎన్ని కుటుంబాలను డిస్ట్రబ్ చేశామో ఆ పిల్లలకు అర్థం అవుతుంది. అయితే వారిని ఆ నిర్వేదం శిక్ష నుంచి తప్పించదు. జువెనైల్ హోమ్ కు వెళ్లాల్సి వస్తుంది.
అక్కడ నుంచి.. తెలిసీతెలియని వయసులో నేరాలు చేసి వచ్చే పిల్లలను సరైన దారిలో పెట్టాల్సిన జువెనైల్ హోమ్స్ లో ఏం జరుగుతుంటుందనే అంశాన్ని ఈ సినిమాలో హైలెట్ చేశారు. అప్పటికే తాము చేసిన పనికి తీవ్రమైన నిర్వేదంలో ఉన్న వారిలో మరి కాస్త పరివర్తనను తీసుకురావడం అటుంచి.. క్రైమ్ చేసి తమ వద్దకు వచ్చిన కుర్రాళ్లను మరింత క్రిమినల్స్ గా మార్చేలా ఉంటాయి జువెనైల్ హోమ్ లో పరిస్థితులు.
ప్రత్యేకించి అక్కడ షాన్ నోక్స్ అనే అధికారి పర్వర్ట్. అక్కడకు వచ్చిన చిన్న పిల్లలపై లైంగిక అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అతడి చేత ఈ హెల్స్ కిచెన్ కుర్రాళ్లు తీవ్రంగా బాధింపబడతారు. ఆ హోమ్ లో వారు ఏడాదిన్నర, రెండేళ్ల లోపు సమయాన్నే గడిపినా.. షాన్ చూపిన చిత్రహింసలను వారు జీవితాంతం మరిచిపోలేని స్థితిలోకి చేరతారు. మగపిల్లలను షాన్, అతడి సహోద్యోగులు లైంగికంగా వేధించే సీన్లు వీక్షించడానికే భయంకరంగా ఉంటాయి. మధ్యమధ్యలో వీరిని చూడటానికి ప్రీస్ట్ (నీరో) వచ్చినా.. వేధింపుల విషయాన్ని అతడికి చెబితే చంపుతానంటూ షాన్ హెచ్చరించి ఉంటాడు. దీంతో వీరు నోరు విప్పలేరు. అంత భయానక అనుభవాలతో జువెనైల్ హోం నుంచి బయటపడతారు హెల్స్ కిచెన్ కుర్రాళ్లు.
బయటకు వచ్చాకా వీరిలో ఇద్దరు (జాన్, టామీ) ప్రొఫెషనల్ క్రిమినల్స్ గా మారి ఉంటారు. జైలు జీవితంలో ఎదురైన వేధింపులు వారిని పక్కా క్రిమినల్స్ గా మార్చి ఉంటాయి. ఆకతాయి చేష్టతో జువెనైల్ హోమ్ కు వెళ్లిన వీళ్లు అక్కడి పరిస్థితులతో క్రైమ్ నే జీవిత వృత్తిగా చేసుకుంటారు. మరో ఇద్దరిలో ఒకడు లోకల్ జర్నలిస్ట్ గా(షేక్స్) మారి ఉంటాడు. తనే ఈ కథను నెరేట్ చేస్తాడు. ఇంకొకడు(మైకేల్) లా చదవి, ఒక పేరున్న లాయర్ కు జూనియర్ గా ఉంటాడు. ఈ లాయర్ పాత్రలోనే యంగ్ బ్రాడ్ పిట్ కనిపిస్తాడు.
జాన్, టామీలు ఒక రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు అక్కడ వారికి షాన్ కనిపిస్తాడు. అతడిని చూడగానే తమను జువెనైల్ హోమ్ లో తను పెట్టిన చిత్రహింసలన్నీ వారికి గుర్తుకు వస్తాయి. మమ్మల్ని గుర్తు పట్టారా.. అంటూ వీరు షాన్ ను అడుగుతారు. తామెవరో గుర్తు చేసి.. మరీ షాన్ ను కాల్చి చంపుతారు వారిద్దరూ. ఈ విషయం షేక్స్, మైకేల్ కు చెబుతారు. షాన్ చచ్చినందుకు వీరు కూడా ఆనందిస్తారు, అంతేకాదు ఈ రీవేంజ్ గేమ్ నుంచి తమ స్నేహితులను బయటకు తీసుకునే బాధ్యతను కూడా తీసుకుంటారు. అక్కడ నుంచి లీగల్ డ్రామా మొదలవుతుంది.
జాన్, టామీలు రీవేంజ్ మొదలుపెట్టారని, తామిద్దరం దాన్ని పూర్తి చేస్తామంటూ తమ స్నేహితులను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు పక్కా ప్లాన్ ను రచిస్తారు. జాన్, టామీలు షాన్ ను హత్య చేస్తుండగా.. తాను చూసినట్టుగా ఒక యువతి సాక్ష్యమిస్తుంది. వారెవరో తనకు పర్సనల్ గా తెలియకపోయినా… రెస్టారెంట్లో వారు షాన్ ను కాల్చి చంపడాన్ని తను చూసినట్టుగా ఆమె పోలీసులకు చెబుతుంది. కోర్టుకు వచ్చి సాక్ష్యమివ్వడానికి రెడీ అంటుంది.
ఈ పరిస్థితుల్లో జాన్, టామీలను దోషులుగా నిరూపించే బాధ్యతను తీసుకుంటాడు మేకేల్! వారు తన స్నేహితులు, తామంతా చిన్నప్పుడు ఒక కేసులో జువెనైల్ హోమ్ కు వెళ్లిన వాళ్లం అనే అంశాన్ని ప్రస్తావనకు రానీయకుండా.. పోలీసుల తరఫున మైకేల్ న్యాయవాది అవుతాడు! తన స్నేహితులను ప్రాసిక్యూట్ చేస్తూ, వారిని దోషులు అని నిరూపించే వాదనను వినిపిస్తూనే.. వారిని బయట పడేసేందుకు లూప్ హోల్స్ ను రెడీ చేస్తాడు మేకేల్.
నిందితుల డిఫెన్స్ కోసం ఒక తాగుబోతు కమ్ చాన్నాళ్లుగా ఒక్క కేసు కూడా గెలవని లాయర్ డేనీ స్నైడర్( డస్టిన్ హోప్మన్) రంగంలోకి దిగుతాడు. ఈ నలుగురు కుర్రాళ్లనూ చిన్నప్పటి నుంచి చూసిన లోకల్ డాన్ డిఫెన్స్ న్యాయవాదికి ఫీజు చెల్లిస్తుంటాడు. ఇదే సమయంలో షాన్ కు తోడు తమను హోమ్ లో చిత్రహింసలు పెట్టిన ఇతర అధికారులపైనా రీవేంజ్ తీర్చుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తాడు లాయర్ మైకేల్. ఒక పోలీసును కరప్షన్ వ్యవహారంలో జైలుకు పంపుతాడు, జైల్లో తమతో పాటు సన్నిహితంగా ఉండి షాన్ చేతుల్లో హతమైన ఒక నల్లజాతి కుర్రాడి కుటుంబం ద్వారా మరో అధికారిని హత్య చేయిస్తాడు.
ఇక జైల్లో ఉన్న తన స్నేహితులను కాపాడుకోవడానికి మరో అధికారిని సాక్షిగా పిలిపిస్తాడు. ఒకవైపు ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపిస్తూనే, హతమైన పోలీసాధికారి వ్యక్తిత్వాన్ని, అతడు జువెనైల్ హోమ్ లో సాగించిన దారుణాలను కోర్టు దృష్టికి వచ్చేలా మైకేల్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. షాన్ చాలా మంచోడని వాదిస్తూనే.. జైల్లో అతడు సాగించిన దురాగతాలు కోర్టులో చర్చకు వచ్చేలా చూసుకుంటాడు. డిఫెన్స్ లాయర్ ఏం మాట్లాడాలో కూడా ప్రతి సారీ మైకేల్ ముందే రాసిస్తూ ఉంటాడు.
సాక్ష్యం చెప్పడానికి వచ్చిన యువతి ఆ రోజు ఏం తిన్నది, ఏం తాగిందీ చెప్పమంటాడు డిఫెన్స్ లాయర్. ఆమె చెప్పిన లిస్టు ప్రకారం.. ఆమె మద్యం మత్తులో ఉందని, కాబట్టి ఆమె నిందితులను అక్కడ చూసిందని అనడం ఎలా సాధ్యమని డిఫెన్స్ లాయర్ ప్రశ్నిస్తాడు. హత్య జరిగిన సమయంలో నిందితులిద్దరూ ప్రీస్ట్ బాబీ దగ్గర ఉన్నాడంటాడు. అయితే ముందుగా తను తప్పుడు సాక్ష్యం చెప్పనంటూ బాబీ స్పష్టం చేస్తాడు. అయితే తామంతా జువెనైల్ హోంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో, తాము అనుభవించిన చిత్రహింసనంతా బాబీకి వివరిస్తాడు షేక్స్. దీంతో తప్పుడు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తాడు బాబీ.
హతమైన పోలీసాధికారి జువెనైల్ హోమ్ లో అత్యంత రాక్షస క్రీడ సాగించాడని, ఎంతో మంది పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు కొందరి మరణానికి కూడా కారణమయ్యాడని కోర్టు పరిగణనలోకి వస్తుంది. ఆఖరికి అతడి స్నేహితులకు కూడా అతడి తత్వం తెలుసని, అందుకే అతడి దగ్గరలో పిల్లలను ఉంచడానికి కూడా వారు వెనుకాడే వారనే అంశం తెరపైకి వస్తుంది. ఇలా అతడి బాధితుల్లో ఎవరైనా అతడిని హత్య చేసి ఉండొచ్చేమో! అనే వాదనను డిఫెన్స్ వినిపిస్తుంది.
జాన్, టామీలిద్దరూ హత్య జరిగిన సమయంలో తన దగ్గర ఉన్నారన్న ప్రీస్ట్ సాక్ష్యంతో జ్యూరీ వారిని నిర్దోషులుగా ప్రకటిస్తుంది. ఇలా తెలిసీతెలియని తనంలో తాము చేసిన చిన్న ఆకతాయి చేష్టకు ప్రతిఫలంగా తమపై చిత్రహింసలు పెట్టి రాక్షసానందాన్ని పొందిన వారిపై ఆ నలుగురూ ప్రతీకారాన్ని తీర్చుకుంటారు.
అయితే క్రైమ్ కు అలవాటు పడ్డ జాన్, టామీలు ఆ తర్వాత మరెవరి చేతిలోనే హతమయ్యారని, మైకేల్ లాయర్ వృత్తిని వదిలి మరో పని చేసుకుంటున్నాడని, షేక్స్ మాత్రం జర్నలిస్ట్ గా కొనసాగుతున్నాడని.. చెబుతూ సినిమా ముగుస్తుంది.
ఈ సినిమా గురించి మరీ మరీ చెప్పుకోవాల్సిన అంశం నటన. హెల్స్ కిచెన్ లో ఆకతాయి చేష్టలకు పాల్పడే పిల్లలే సగం సినిమాను నడిపిస్తారు. తొలి సగం అంతా వారు చిన్న పిల్లలుగా ఉన్నప్పటి సీన్లతో సాగితే, రెండో సగానికి మాత్రమే బ్రాడ్ పిట్ తదితరులు ఆ పాత్రల్లోకి వస్తారు! ఫాదర్ బాబీగా నీరో లోతైన వ్యక్తిత్వాన్ని తన నటనతో అద్భుతంగా ప్రదర్శించాడు. కనిపించే సీన్లు తక్కువే అయినా.. తాగుబోతు లాయర్ గా హోప్మన్ ఆ సీన్లను ఆసాధారణ స్థాయికి తీసుకెళ్లాడు.
తెలిసీ తెలియక తాము చేసిన తొలి పొరపాటు గురించి కుర్రాళ్ల కన్ఫెషన్ ను నెరేటర్ వ్యక్తీకరించే విధానం సినిమాను గాఢమైనదిగా మారుస్తుంది. ఆ తర్వాత కూడా నెరేటర్ పాత్రకు రాసిన డైలాగులు సీన్ల కన్నా బలంగా తాకుతాయి. ఇంతకీ ఈ సినిమాకు సంబంధించి 'స్లీపర్స్' అంటే ఏమిటంటే, చిన్న చిన్నవో, పెద్ద పెద్దవో నేరాలు చేసి జువెనైల్ హోమ్ లో కొంతకాలం ఉండి, ఆ తర్వాత బయటకు వచ్చి సమాజంలో కలిసిపోయే వారిని స్లీపర్స్ గా వ్యవహరిస్తారట అమెరికన్ పోలిస్ పరిభాషలో. అలాంటి కుర్రాళ్లు ఉండే ప్రాంతం మీదే పోలీసుల చూపు ప్రత్యేకంగా ఉంటుందట.
-జీవన్ రెడ్డి.బి