దేశంలో ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకున్నా ఏపీ సీఎం జగన్‌తో ముడిపెట్టడం ఎల్లో మీడియా, టీడీపీకి అలవాటైంది. నిజానిజాలతో సంబంధం లేకుండా అలాంటి దుష్ప్రచార పునాదులపై అధికార సౌధాన్ని నిర్మించుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే ఇలాంటివి ప్రస్తుత మారిన రాజకీయ పరిస్థితుల్లో వర్కౌట్ కావని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలుసుకుంటే ఆ పార్టీకే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో, హవాలా లావాదేవీల అంశాలు కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇందులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన చీకోటి ప్రవీణ్ భుజంపై తుపాకి పెట్టి జగన్‌ను రాజకీయంగా కాల్చాలనే ప్రయత్నాల్ని టీడీపీ చేస్తోంది. మరోవైపు చీకోటి ప్రవీణ్‌తో టీడీపీ నేతలకు సత్సంబంధాలున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఇరుపార్టీలు కూడా పరస్పరం బురదజల్లుకుంటున్నాయనడంలో సందేహం లేదు.
ఈ నేపథ్యంలో చీకోటి ప్రవీణ్‌పై ఈడీ కేసు నమోదు, విచారణ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విచారణలో చీకోటి చెప్పే వివరాలు ఎవరి రాజకీయ కొంప ముంచనున్నాయో అనే ఆందోళన నెలకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై పరిచయానికి సంబంధించి చీకోటి ప్రవీణ్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ తనకు సీఎం జగన్‌తో పరిచయమే లేదన్నారు. రాజకీయాలతో తనకు ముడిపెడుతున్నారని వాపోయారు.
తన పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాలు తెరవడంపై ఆయన సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఖాతాలతో కించపరిచేలా పోస్టులు పెడుతున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఉన్నట్టు ఆయన ఆరోపించడం గమనార్హం. నకిలీ ఖాతాల విషయమై గురువారం ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన అన్నారు. చీకోటి కేంద్రంగా ఇంకా ఎలాంటి దుష్ప్రచారానికి తెగబడుతారో చూడాలి.