రాజమౌళి సినిమా చాలా వెనక్కి?

2024 జనవరి నుంచి సూపర్ స్టార్ మహేష్ తో దర్శకుడు రాజమౌళి సినిమా అని ఇప్పటి వరకు వినిపిస్తూ వస్తున్నాయి వార్తలు. ఆర్ఆర్ఆర్ విడుదలై అప్పటికి దాదాపు పది నెలలు దాటిపోతుంది. అందువల్ల ఈ…

2024 జనవరి నుంచి సూపర్ స్టార్ మహేష్ తో దర్శకుడు రాజమౌళి సినిమా అని ఇప్పటి వరకు వినిపిస్తూ వస్తున్నాయి వార్తలు. ఆర్ఆర్ఆర్ విడుదలై అప్పటికి దాదాపు పది నెలలు దాటిపోతుంది. అందువల్ల ఈ గ్యాప్ సరిపోతుంది రాజమౌళికి అని అంచనా. పైగా సినిమా ప్రారంభించడానికి, సెట్ మీదకు వెళ్లడానికి కూడా రాజమౌళి చాలా టైమ్ తీసుకుంటారు. 

హీరో ప్రిపరేషన్, మేకోవర్, డిస్కషన్లు, ప్రీ ప్రొడక్షన్ అన్నది చాలా డిటైలింగ్ గా వుంటుంది ఆయన దగ్గర. అందువల్ల జనవరి నుంచి తనకు అందుబాటులో వుండాలని మహేష్ బాబును దర్శకుడు రాజమౌళి కొరారని వార్తలు కూడా వచ్చాయి.

కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే జనవరి కాదు కదా మార్చి-ఏప్రిల్ కు కూడా మహేష్ రెడీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. త్రివిక్రమ్ సినిమా ఇంకా ప్రారంభం కావాల్సి వుంది. త్రివిక్రమ్ ఇప్పుడు పూర్తిగా ఆ పని మీదే వున్నారు. లెక్క ప్రకారం ఈ నెల 15న షూటింగ్ ప్రారంభం, 16 నుంచి సెట్ మీదకు మహేష్ బాబు రావడం అన్నది ఇప్పటికి వున్న షెడ్యూలు.

కానీ ఇప్పుడు నిర్మాతల బంద్ నడుస్తోంది. ఈ బంద్ 10 వ తేదీ లోపే అయిపోతుందని అంటున్నారు. అలా కాకపోతే మాత్రం మహేష్ సినిమా షూట్ ప్రారంభం కావడం కష్టం. బంద్ వీలయినంత త్వరగా ముగించడానికే గిల్డ్ చకచకా వ్యవహరిస్తోంది. రెండూ రెండు సమావేశాలు వంతున ప్లాన్ చేస్తున్నారు. అన్ని క్రాఫ్ట్ లతో సమావేశాలు, డిస్కషన్లు, ఖర్చు తగ్గింపు వంటి నిర్ణయాలు చకచకా తీసుకోవాల్సి వుంది.

ఆ పైన ఇవన్నీ ఫైనల్ డ్రాఫ్ట్ కు సిద్దం కావాలి. ఆ తరువాత ఈ మేరకు చాంబర్ కు ఇస్తే అక్కడ తీర్మానాలు, నిర్ణయాలు జరగాల్సి వుంది. ఇదంతా తక్కువ ప్రాసెస్ కాదు. పైగా అన్నింటికి మించి కీలకమైన వీపీఎఫ్‌ సమస్య పరిష్కారం అంత సులువు కాదు. అందువల్ల ఇవన్నీ 10 లోపు తేలిపోతే ఫరవా లేదు. కనీసం 15కు మిగిసినా ఓకె. లేదూ అంటే మహేష్ సినిమా మరింత వెనక్కు వెళ్తుంది.

పోనీ 15న ప్రారంభం అయిపోయినా, కనీసం ఆరేడు నెలల సమయం అయితే కావాలి. అందువల్ల రాజమౌళికి అందుబాటులోకి మహేష్ రావాలంటే 2023 మార్చి నెల రావాల్సిందే.