లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మేథస్సులో ఎవరూ తక్కువ కాదు. ఉన్నతాధికారిగా జయప్రకాశ్ నారాయణకు విశేష అనుభవం ఉంది. రాజకీయంగా ఉండవల్లికి మేధావిగా, నిజాయతీపరుడిగా గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఇటీవల వాళ్లిద్దరి మధ్య లోకానికి తెలియని ఆసక్తికర చర్చ జరిగింది. ఈ విషయం ఇవాళ ఉండవల్లి బయటపెట్టడంతో తెలిసింది.
దేశానికి క్యాప్టిలిజం ఉత్తమమని జయప్రకాశ్ నారాయణ నమ్ముతుంటే, కాదని ఉండవల్లి గట్టిగా వాదిస్తున్నారు. చర్చకు సిద్ధమని ఉండవల్లి మరోసారి మీడియా సాక్షిగా జయప్రకాశ్ నారాయణకు ఆహ్వానం పలికారు. జయప్రకాశ్ నారాయణ చెబుతున్న క్యాప్టిలిజాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్టు మరోసారి ఉండవల్లి తేల్చి చెప్పారు. ఇవాళ మీడియా సమావేశంలో ఉండవల్లి ఏమన్నారో తెలుసుకుందాం.
క్యాప్టిలిజమ్ వల్లే దేశానికి మంచి జరుగుతుందని జయప్రకాశ్ నారాయణ భావిస్తున్నారన్నారు. ఆయన అభిప్రాయాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఆయన కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. జయప్రకాశ్ నారాయణతో తనకెలాంటి గొడవ లేదన్నారు. ఇటీవల డాక్టర్స్ డే సందర్భంగా ఓ కాలేజీ ఫంక్షన్‌లో జయప్రకాశ్, తాను కలిసి పాల్గొన్నట్టు చెప్పారు. పిల్లలకు తాను నాలుగు నీతి వాక్యాలు చెప్పానన్నారు. తన మాటలు జయప్రకాశ్ నారాయణకు నచ్చలేదన్నారు. అరుణ్‌కుమార్ మాట్లాడిన దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నానంటూ, తనపైనే పూర్తిగా స్పీచ్ ఇచ్చారని గుర్తు చేశారు.
ఎవరి ఇష్టం వాళ్లదని ఉండవల్లి అన్నారు. తాను చెప్పింది ఇతరులకు నచ్చాలనే రూల్ లేదన్నారు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం చాలా తప్పని జయప్రకాశ్ అన్నారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్‌లో పని చేసేవాడల్లా ఇది తనదే అనే ఫీలింగ్‌తో ఉన్నాడని, అది చాలా తప్పని జయప్రకాశ్ నారాయణ అన్నారని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ఈ దేశానికి క్యాప్టిలిజమే కరెక్ట్ తప్ప, సోషలిజం తప్పని జయప్రకాశ్ నారాయణ అన్నారన్నారు. ఆయన ఆ విధంగా చాలా సార్లు అనడం విన్నట్టు చెప్పారు.
అయితే ఉపన్యాసం పూర్తి కాగానే మైక్ తీసుకుని మీ అభిప్రాయంతో వ్యతిరేకిస్తున్నానని, ఈ విషయమై చర్చిద్దామా? అని ప్రశ్నించానన్నారు. అయితే ఆ రోజు జయప్రకాశ్‌కు మీడియా సమావేశం ఉండడంతో వెళ్లిపోయారన్నారు. మీడియాతో సమావేశం అనే విషయం తెలిసి వుంటే, అక్కడికే వచ్చి తాను చర్చించి వుండేవాడినన్నారు. తాము చర్చకు కూచుని వుంటే కుస్తీలు లాంటివి వుండేవి కాదన్నారు.
జయప్రకాశ్ నారాయణ ఏదేతై క్యాప్టిలిజమ్ వల్ల ఈ దేశానికి మంచిదని అంటున్నారో, దాని వల్ల ఈ దేశం సర్వనాశనమై సముద్రంలో కలిసిపోతుందని నమ్ముతున్నట్టు ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంతకంటే పనికిమాలిన మాట మరొకటి లేదన్నారు. దేశానికి దివంగత ప్రధాని నెహ్రూ ప్రతిపాదించిన మిక్స్‌డ్ ఎకానమీ సరైందన్నారు. జయప్రకాశ్ సిద్ధాంతం ప్రకారం దేశాన్ని అంబాని, అదానీ చేతుల్లో పెడితే బాగుంటుందన్నారు.
తన సిద్ధాంతం వేరన్నారు. తాను కడుపు నిండా తింటూ, పక్కనోళ్లు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకోలేననన్నారు. దయాగుణం వుండడం పెట్టుబడిదారుల దృష్టిలో పెద్ద లోపమన్నారు. దోపిడీయే ఈ దేశానికి మార్గం అనేవాళ్లు క్యాప్టిలిస్టులు అని ఉండవల్లి అన్నారు. ఈ దేశానికి క్యాప్టిలిజమ్ మార్గమా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మీటింగ్‌లో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అన్నారు. కానీ మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అందుకే కలిసి చర్చిద్దామని జయప్రకాశ్ నారాయణతో అన్నానన్నారు. క్యాప్టిలిజమ్, సోషలిజంపై ఇద్దరు మేధావుల మధ్య చర్చ కోసం తెలుగు సమాజం ఆసక్తితో ఎదురు చూస్తోంది. వాళ్లిద్దరి మధ్య తప్పక ఓ మంచి విజ్ఞానదాయక చర్చ జరుగుతుందని ఆశిద్దాం.