చంద్రబాబు హయాంలోని విద్యా వ్యాపార దందాపై జగన్ ప్రభుత్వానికి మోజు ఎందుకనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. చంద్రబాబు హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సొంత వాళ్ల ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అయితే టెట్ పేరుతో సాగుతున్న దందా గురించి తెలుసో లేక తెలియదో… కానీ దాన్ని కొనసాగిస్తుండడం మాత్రం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
డీఎస్సీ రాయడానికి ఏపీ టెట్ అత్యంత కీలకమైంది. టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)గా పిలుచుకుంటారు. టెట్‌లో వచ్చిన మార్కులను డీఎస్సీ వెయిటెజీకి తీసుకోవడం వెనుక భారీ దోపిడీ దాగి వుందనే ఆరోపణలున్నాయి. 20 మార్కులను డీఎస్సీ వెయిటెజీకి కలపడం వెనుక టెట్ కోచింగ్ సెంటర్ల మాయాజాలం ఉందని అంటున్నారు. ఉదాహరణకు టెట్ కోచింగ్‌కు అవనిగడ్డ చాలా ప్రసిద్ధి. దాదాపు 25 వేల మంది ఇక్కడే కోచింగ్ తీసుకుంటారో ఏ స్థాయిలో పేరున్నదో అర్థం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల టర్నోవర్ నడుస్తోంది.
యూజీసీ వాళ్లు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎంపిక చేసేందుకు నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) నిర్వహిస్తారు. నెట్లో వచ్చిన మార్కులను యూజీసీ వాళ్లు వెయిటేజీ కింద తీసుకోరు. నెట్, టెట్ పేరు ఏదైనా కేవలం అర్హత పరీక్షలు మాత్రమే అని గుర్తించాలి. మరి ఎందుకని ఏ ఉద్యోగ పరీక్షకు లేని విధంగా టెట్‌కు మాత్రం ప్రత్యేక నిబంధనలనే ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు హయాంలో టెట్ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయుల దోపిడీకి తెరలేచింది.
ఇది జగన్ ప్రభుత్వంలోనూ కొనసాగుతుండడంతో చర్చకు తెరలేచింది. ఎలిజిబులిటీకి, మెరిట్‌కు తేడా లేకుండా పోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెట్ మార్కులను డీఎస్సీ వెయిటేజీ కింద తీసుకోడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తాల్లో చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. ఇది చంద్రబాబు ప్రభుత్వంలో మొదలై, నేడు జగన్ హయాంలో కూడా కొనసాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వంలో తీసుకున్న అసంబద్ధ, విద్యార్థులను దోచుకునే విధానాలను జగన్ ప్రభుత్వం ఎందుకు అరికట్టలేకపోతుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు. టెట్‌ను కేవలం అర్హత పరీక్షగా మాత్రమే నిర్వహిస్తే, విద్యార్థులెవరూ కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన పని వుండదు. దీంతో తమ వ్యాపారం దెబ్బతింటుందని కోచింగ్ సెంటర్ల దోపిడీదారులు ప్రభుత్వ పెద్దలకు కోట్లాది రూపాయలు ముట్టజెప్పి విద్యార్థులపై భారాన్ని మోపారనే విమర్శలున్నాయి.
టెట్ కోచింగ్ నిర్వాహకులు అవసరమైతే ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేంత ఘనులని విద్యార్థులు వాపోతున్నారు. టెట్ విద్యా వ్యాపార దోపిడీని జగన్ ప్రభుత్వం నిలువరించాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం సానుకూల ఆలోచన, నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.