మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అంశం తెలంగాణలో రాజకీయ వేడి రగిల్చింది. కాంగ్రెస్ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మంగళవారం రాత్రి కోమటిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. రాజగోపాల్‌పై విరుచుకుపడ్డాడు. కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నాడని విమర్శించారు. బీజేపీ విసిరే ఎంగిలి మెతుకుల కోసం తల్లి లాంటి పార్టీని మోసగించాడని రేవంత్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఇవాళ మరోసారి రాజగోపాల్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు. రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, సవాల్ విసిరారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారుతున్నట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు. ఒకవేళ నిరూపించకపోతే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి వదులుకుంటారా? అని రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసరడంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి.
రేవంత్‌పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించడాన్ని పరిశీలించొచ్చు. రేవంత్ ఓ చిల్లర దొంగ అని ఘాటు విమర్శ చేశారు. రేవంత్ బ్రాండ్ ఇమేజ్ బ్లాక్ మెయిలర్ అని మండిపడ్డారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించిన ఘనత రేవంత్‌ది అని ఆరోపించారు. ఏ వ్యాపారం చేయని రేవంత్‌కు కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయని రాజగోపాల్ ప్రశ్నించారు.
రేవంత్‌కు వ్యక్తిత్వం లేదని ధ్వజమెత్తారు. రేవంత్‌లా డబ్బు కోసం తాను ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయనన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకెళ్లిన రేవంత్‌తో నీతులు చెప్పించుకోవాలా? అని రాజగోపాల్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ కొనుక్కున్నారని ఆరోపించారు. రేవంత్, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు రాజకీయంగా విభేదాలున్న సంగతి తెలిసిందే.
రాజగోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో విమర్శలకు ఇదే అదునుగా తీసుకుని రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. తాను కూడా తగ్గేదేలే అన్నట్టు రాజగోపాల్‌రెడ్డి గట్టిగా కౌంటర్ ఇవ్వడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇలాంటి ఘాటు విమర్శలు, ప్రతివిమర్శలను మరిన్ని చూడాల్సి వుంటుంది. ఇది కేవలం మొదలు మాత్రమే.