కెఎ పాల్ ఓవరాక్షన్.. బుద్ధిచెప్పే వారు లేక..!

కెఎ పాల్ అంటే రాజకీయ కమెడియన్. 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీకి ఉండగల అవకాశాలను దెబ్బతీయడానికి ఫ్యాను గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తుతో ఎన్నికల్లోకి ప్రయోగించబడిన ఒక శిఖండి. అయినా ఆశించిన ఫలితం దక్కక..…

కెఎ పాల్ అంటే రాజకీయ కమెడియన్. 2019 ఎన్నికలకు ముందు.. వైసీపీకి ఉండగల అవకాశాలను దెబ్బతీయడానికి ఫ్యాను గుర్తును పోలిన హెలికాప్టర్ గుర్తుతో ఎన్నికల్లోకి ప్రయోగించబడిన ఒక శిఖండి. అయినా ఆశించిన ఫలితం దక్కక.. కొన్నేళ్లు పలాయనం చిత్తగించిన ఈ ‘టార్చ్ బేరర్’ కమెడియన్.. ఇప్పుడు మళ్లీ తన కామెడీ పండించడానికి రాజకీయాల్లో కనిపిస్తున్నారు. 

గత ఎన్నికల్లో ఏపీలో గెలవడం సీఎం కావడం అనే తంతు ముగిసిపోయింది.. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగి తాను సీఎం కాబోతున్నానని సెలవిస్తున్నారు. సెంటర్లో మోడీ ఓడిపోవడం ఖాయం అని.. ఆ ఓటమిని తాను శాసించబోతున్నానని.. 300కు పైగా ఎంపీ నియోజకవర్గాల్లో తన వారు గెలుస్తారని ఇంకా ఇలాంటి ఏవేవో సంధిప్రేలాపనలు చేస్తున్నారు. 

నిజానికి కెఎ పాల్ చేస్తున్న ఈ కామెడీని ప్రజలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి సంగతి ఎలా ఉన్నా కెఎ పాల్ ప్రెస్ మీట్ పెడుతున్నారంటే మాత్రం అన్ని చానల్స్ కు సంబంధించిన వాళ్లూ ఖచ్చితంగా హాజరవుతారు! ఎందుకంటే.. ఆయన కామెడీ ఫుటేజీ వాళ్ల వద్ద ఉంటే ఎప్పటికీ ఉపయోగపడుతుంటుందనే నమ్మకం. ఆయన ఇంటర్వ్యూలు చేయడానికి చానళ్లు, యూట్యూబర్లు ఉత్సాహపడుతుంటారు. 

ఆయన ఈ రకంగా ఎంతెంత కామెడీ చేసినా ఓకే. కానీ.. కెఎ పాల్ తిరుపతి మహిళా యూనివర్సిటీలో చేసిన హంగామా మాత్రం అసహ్యమైనది. తప్పుపట్టదగినది. చర్య తీసుకోవాల్సినది!

మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో కెఎ పాల్ కు చెందిన అయిదు వాహనాలు పద్మావతి యూనివర్సిటీలోకి ప్రవేశించాయి. అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను అడ్డుకోబోతే.. ఆయన సెక్యూరిటీని బెదిరించి లోనికి ప్రవేశించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని రోడ్లమీదే వాహనాలు ఆపి అటుగా వెళుతున్న విద్యార్థినులను పిలిచి మాట్లాడారు. వారితో కలిసి సెల్పీలు దిగారు. అమ్మాయిలతో వారి తల్లిదండ్రులకు ఫోను చేయించి వారితో కూడా మాట్లాడారు. 

అనుమతి లేకుండా యూనివర్సిటీలోకి ప్రవేశించినందుకు, వర్సిటీ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ తర్వాత కూడా కెఎ పాల్ హంగామా చేశారు. స్టేషన్ కు రావాలని పోలీసులు అంటే.. వారితో వాగ్వాదానికి దిగారు. కొంతసేపటికి ఆయనను పంపేసిన పోలీసులు.. అనుమతి లేకుండా మహిళా యూనివర్సిటీలోకి ప్రవేశించినందుకు కెఎపాల్ పై కేసు పెట్టారు. 

తిరుపతిలో మంగళవారం ప్రెస్ మీట్ పెట్టిన కెఎ పాల్.. తెలంగాణలో తాను సీఎం అవుతానని, ఏపీలో ఒక మహిళను సీఎం చేస్తానని ప్రకటించడం విశేషం. ఇలాంటి కామెడీలు ఆయన ఎన్ని చేసినా ఓకే గానీ.. మహిళా యూనివర్సిటీలోకి అనుమతి లేకుండా వెళ్లి హంగామా చేయడం ఏంటో అర్థం కాని సంగతి. పోలీసులు కేసు పెట్టి ఊరుకోకుండా.. పాల్ పై చర్య తీసుకుంటే తప్ప ఇలాంటి తిక్క కుదరదని ప్రజలు అనుకుంటున్నారు.