తమ ఎమ్మెల్యే వైఎస్ జగన్ సీఎం అయితే పులివెందుల బతుకు మారుతుందని అక్కడి వైసీపీ నేతలు ఎన్నో కలలు కన్నారు. ముఖ్యంగా తమ జీవితాల్లో మెరుపులుంటాయని పులివెందుల వైసీపీ నేతలు కొండంత ఆశలతో ఉన్నారు. పులివెందుల వాసులు కలలు కన్నట్టు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ జగన్ సీఎం అయ్యారు. మూడేళ్ల పాలనా కాలం కూడా పూర్తయ్యింది. ఒకట్రెండు ప్రాజెక్టులు తప్ప ప్రత్యేకంగా పులివెందులకు ఒరిగిందేమీ లేదు.
ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన వైసీపీ నేతలు మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం. రాజకీయ, ఆర్థిక వ్యవహారాలు చూసే సీఎంవోలోని కీలక అధికారితో పులివెందుల వైసీపీ నేతలు తమ గోడు వెల్లబోసుకున్నట్టు తెలిసింది.
నియోజకవర్గంలో వైసీపీ నేతలకు బిల్లులు కాలేదని, అలాగే రైతులకు సంబంధించి హార్టికల్చర్ పంటల సాగుకు సబ్సిడీపై యంత్రాలు ఇవ్వడం లేదని, సీఎం నియోజకవర్గానికి చెందిన తాము జగన్ను కలిసే అవకాశం లేదని, చిన్నచిన్న సమస్యల పరిష్కారానికి ఎవరిని కలవాలో అర్థం కావడం లేదని, ఇలాగైతే ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లాలని సదరు ముఖ్య అధికారి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పులివెందుల నాయకులకు ఇలాంటి దుస్థితి లేదని నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలిసింది. పార్టీ అధికారంలోకి వస్తే బిల్లులు మంజూరవుతాయని ఆశించామని, కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకున్నాయని గోడు వినిపించినట్టు సమాచారం. కనీసం సచివాలయ భవనాలు నిర్మించిన సొంత పార్టీ నేతలకు కూడా బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలై ఊళ్లు వదలాల్సి వస్తోందని వాపోయినట్టు సమాచారం.
పులివెందుల వైసీపీ నేతల గోడంతా విన్న సదరు కీలక అధికారి, అన్ని విషయాలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పినట్టు తెలిసింది. అంతే తప్ప బిల్లుల మంజూరు, సమస్యల పరిష్కారానికి ఎలాంటి హామీ ఇవ్వలేదని పులివెందుల వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి పులివెందుల వైసీపీ నేతల గోడు ముఖ్యమంత్రి కార్యాలయంలో హాట్ టాపిక్ అయ్యింది.