ప్రధాన ప్రత్యర్థి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఎలాగైనా ఓడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉడుం పట్టు పట్టారు. అందుకే ఆయన పదేపదే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు సాధించడం అసాధ్యం కాదని చెప్పడం. రాజకీయాల్లో సహజంగా ప్రత్యర్థులతో మైండ్‌గేమ్ ఆడే క్రమంలో రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటారు.
కానీ జగన్ మాత్రం చంద్రబాబును ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతేకాదు, ఆ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో సమరోత్సాహంతో గెలుపు సాధించాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేస్తున్నారు.
కుప్పం మున్సిపాలిటీ, సర్పంచ్, పరిషత్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను ఓడించామని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు సాధ్యం కాదనేది ఆయన ప్రశ్న. చంద్రబాబును ఓడించేందుకు పక్కా ప్రణాళిక రచిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని చంద్రబాబు పసిగట్టారు. రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటిస్తూ… ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిణామాలను పర్యవేక్షిస్తున్నారు. రాజకీయ చరమాంకంలో ఇలాంటి దుస్థితి వస్తుందని చంద్రబాబు అసలు ఊహించలేదు.
చంద్రగిరి నుంచి 1978లో కాంగ్రెస్ (ఐ) తరపున మొదటిసారి చంద్రబాబు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ సునామీలో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎం.వెంకట్రామానాయుడి చేతిలో చంద్రబాబు ఓడిపోయారు. అనంతర కాలంలో చంద్రబాబు టీడీపీలో చేరారు. సామాజిక సమీకరణల రీత్యా తనకు ఎప్పుడైనా చంద్రగిరి ప్రమాదమే అని గ్రహించారు. దీంతో కుప్పానికి మకాం మార్చారు. అప్పటి నుంచి కుప్పంలో ఎదురులేని నాయకుడిగా చంద్రబాబు ప్రతి ఎన్నికలోనూ గెలుస్తున్నారు.
కానీ ప్రధాన ప్రత్యర్థి వైఎస్ జగన్ కొత్త తరహా రాజకీయానికి తెరలేపారు. ప్రత్యర్థి అయితే చాలు, ఓడించాల్సిందే అని జగన్ పంతం. ఈ నేపథ్యంలో కుప్పానికి జగన్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎమ్మెల్యేలతో వరుస భేటీలు జరిపిన జగన్, తాజాగా కార్యకర్తల మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా గురువారం నుంచి కార్యకర్తలతో భేటీకి ముహూర్తం ఖరారు చేశారు.
మొట్టమొదటగా తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం వైసీపీ కార్యకర్తలతో మాట్లాడాలని జగన్ భావించడం విశేషం. దీన్ని బట్టి కుప్పానికి జగన్ ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ నియోజకవర్గంలోని 50 మంది వైసీపీ కార్యకర్తలతో జగన్ మాట్లాడి, పార్టీ గెలుపు కోసం ఏం చేయాలో తెలుసుకోనున్నారు.
అలాగే చంద్రబాబును ఓడించేందుకు దిశానిర్దేశం చేయనున్నారు. చంద్రబాబును ఓడిస్తామని ఏదో మాట వరుసకు జగన్ అనలేదని ఆయన వేస్తున్న ప్రతి అడుగు చెబుతోంది. కుప్పంలో బాబును ఓడించేందుకు జగన్ ఉడుం పట్టు పట్టారనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. మరి నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు ఎలాంటి పైఎత్తులు వేస్తారో కాలం జవాబు చెప్పాల్సి వుంది.