Advertisement

Advertisement


Home > Politics - Analysis

చంద్రబాబు నీరసమే.. జగన్‌కు ప్రేరణ!

చంద్రబాబు నీరసమే.. జగన్‌కు ప్రేరణ!

పార్టీల అధినేతలు నియోజకవర్గాల స్థాయిలో కార్యకర్తలతో సమావేశం అవుతుండడం చాలా మంచి పరిణామం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడానికి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి.. వారిని చైతన్యవంతం చేయడానికి అధినేత నిర్వహించే ఈ తరహా సమావేశాలు ఉపకరిస్తాయి. 

ఏపీలో ఇంకా ఎన్నికలు ముంచుకురాలేదు గానీ.. పార్టీల అధినేతలు మాత్రం అప్పుడే నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో సమావేశాలు షురూ చేసేశారు. అటు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆల్రెడీ మొదలుపెట్టగా, ఇటు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. అయితే.. పోల్చి చూసినప్పుడు.. ఈ కార్యకర్తల సమావేశాల్లో చంద్రబాబు కనబరుస్తున్న నీరసమే.. జగన్మోహన్ రెడ్డికి ద్విగుణీకృత ఉత్సాహంగా, ప్రేరణగా నిలుస్తున్నట్టు కనపిస్తోంది. 

చంద్రబాబునాయుడు కార్యకర్తలతోసమావేశాలను చాలా కాలం కిందటే ప్రారంభించారు. ఆయనకు ఈ సమావేశాల్లో రకరకాల భిన్నమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. చంద్రబాబునాయుడు సమక్షంలోనే ఆయనను, ఆయన హితోక్తులను ఏమాత్రం లెక్క చేయకుండా.. ముఠాలు కట్టిన లోకల్ నాయకులు కొట్టుకోవడం జరిగింది. 

ఐక్యంగా ఉండాలని చంద్రబాబు అంటోంటే.. ఆయన ఎదుటే నాయకులు పరస్పరం చొక్కాలు పట్టుకున్న సంఘటనలు జరిగాయి. ఆయన మాటలకు ఎదురుతిరిగి మాట్లాడిన ఉదంతాలు ఉన్నాయి. పార్టీ మీద చంద్రబాబునాయుడుకు ఏమాత్రం అదుపులేకుండా పోయిందా అని చూసిన వారికి అనుమానం కలిగేలా గా ఆ సమీక్ష సమావేశాలు జరిగాయి. 

కుప్పం నియోజకవర్గం కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో అయితే.. చంద్రబాబు నాయుడు ఏడవడం ఒక్కటే తక్కువ. తన సొంత నియోజకవర్గంలో కూడా ఏ పనీ అనుకున్నట్టుగా జరగడం లేదంటూ.. ఆయన వాపోయారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు పట్టించుకోవడం లేదని విలపించారు. ఈ విలాపాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి ప్రేరణ ఇచ్చినట్టున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క చోట నుంచి 50 మంది కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కాదలచుకున్న జగన్.. వాటిని కుప్పంతోనే ప్రారంభిస్తున్నారు. 

చంద్రబాబునాయుడుకు కంచుకోటగా ముద్రపడిన కుప్పం నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కైవశం చేసుకోవాలని వైసీపీ ఫోకస్ పెట్టింది. చంద్రబాబును ఏడుసార్లుగా అప్రతిహతంగా గెలిపిస్తున్న కుప్పం ప్రాంతంలో ఇప్పుడు.. ఎటు చూసినా.. వైసీపీ నాయకుల ఫ్లెక్సిలు, బ్యానర్లు కూడా మిక్కిలిగా కనిపిస్తూన్నాయి. 

కుప్పం మునిసిపాలిటీని చేజిక్కించుకుని వైసీపీ చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆ భయం మొత్తం ఆయన ఇటీవల నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రతిఫలించింది. ఇప్పుడు జగన్ కూడా కుప్పం తోనే తన సమావేశలకు శ్రీకారం చుడుతున్నారు. 

చంద్రబాబు నీరసమే జగన్ కు ప్రేరణ అవుతుండగా.. జగన్ తన మాటలతో.. కార్యకర్తలకు అదే ప్రేరణ, స్ఫూర్తి అందించబోతున్నారు. రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాలూ గెలవాలి అనే లక్ష్యంతో సాగుతున్న పార్టీ.. ఆ లక్ష్యాన్ని అందుకోలేకపోయినా.. కుప్పంలో చంద్రబాబును మట్టి కరిపిస్తే.. అంత పనీ చేసినట్లే అనే అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?