రాబోయే ఫలితం గురించి పవన్ కు ఆల్రెడీ తెలుసు.
మళ్లీ సినిమాల్లోకి వెళ్తే ఉన్న పరువు పోతుందనీ తెలుసు.
ఎలాగైనా పాలిటిక్స్ లో కొనసాగాలి. రాజకీయాలే చేయాలి. తనకు తాను ఏదో ఒక పని కల్పించుకోవాలి. అందుకే ఫలితాలకు ముందే ప్లాన్-బిని అమలు చేయాలని నిర్ణయించారు జనసేన అధ్యక్షుడు. ఈ మేరకు త్వరలోనే ఆయన మరోసారి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
అవును.. సార్వత్రిక ఎన్నికల సంరంభం ముగియడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టారు పవన్ కల్యాణ్. మిగతా పార్టీల కంటే ముందే ఈ దిశగా కార్యాచరణ సిద్ధంచేసి, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల పవన్ కు రెండు ఉపయోగాలున్నాయి.
ప్రస్తుతం జనసేన పార్టీలో రాజకీయ నిరుద్యోగత ఏర్పడింది. కొంతమంది ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోగా, మిగతా జనాలకు ఏం చేయాలో అర్థంకావడం లేదు. ఇలాంటి వాళ్లందరికీ పని కల్పించాలంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి. అంతకుమించి జనసేనానికి మరో దారిలేదు. ప్రస్తుతం పవన్ చేస్తోంది అదే.
ఈ పనిచేయడం వల్ల పవన్ కు మరో ఉపయోగం కూడా ఉంది. ఇప్పటివరకు పార్టీని వ్యవస్థాగతంగా నిర్మించలేకపోయారు పవన్. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నికల టైమ్ లో పవన్ కు సమయం సరిపోలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లాలనేది పవన్ ఆలోచన.
అధికారంలో ఏ పార్టీ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు. పైకి పార్టీ గుర్తులు కనిపించకపోయినా, తెరవెనక జరిగేదంతా కీలకపార్టీల మంత్రాంగమే. ఇది బహిరంగ రహస్యం. సో.. ఈ ఎన్నికల్లో జనసేన గెలుస్తుందనేది దాదాపు ఓ పగటికల లాంటిదే. ఈ విషయం పవన్ కు కూడా తెలుసు. తన పార్టీ గెలవకపోయినా పల్లెల్లోకి విస్తరిస్తుందనే ఉద్దేశంతో ఇలా ముందుగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు పవన్.
మొన్న జరిగిన ఎన్నికల్లో తన వెనక చంద్రబాబును నీడలా పెట్టుకున్న పవన్ కల్యాణ్, జగన్ పై విపరీత విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి జనాల్లోకి వెళ్లబోతున్న పవన్, ఈసారైనా టీడీపీ ప్రభావం నుంచి బయటకొస్తారా లేదా అనే విషయం తేలిపోతుంది.