డ్రగ్స్‌ ఇన్‌ టాలీవుడ్‌: వాళ్ళంతా బాధితులేనా.?

తెలుగు సినీ పరిశ్రమని రెండేళ్ళ క్రితం డ్రగ్స్‌ కేసు ఓ కుదుపు కుదిపేసింది. 12 మంది సినీ ప్రముఖుల్ని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ తరఫున ఏర్పాటైన 'సిట్‌' విచారించిన విషయం విదితమే. దర్శకుడు పూరి…

తెలుగు సినీ పరిశ్రమని రెండేళ్ళ క్రితం డ్రగ్స్‌ కేసు ఓ కుదుపు కుదిపేసింది. 12 మంది సినీ ప్రముఖుల్ని తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ తరఫున ఏర్పాటైన 'సిట్‌' విచారించిన విషయం విదితమే. దర్శకుడు పూరి జగన్నాథ్‌, నటి ఛార్మి, నటుడు రవితేజ, మరోనటి ముమైత్‌ ఖాన్‌.. ఇలా ఆయా సినీ ప్రముఖులు విచారణకు హాజరైనప్పుడు జరిగిన 'యాగీ' అంతా ఇంతా కాదు. అదిగో పూరి జగన్నాథ్‌ అరెస్ట్‌, ఇదిగో ఛార్మి అరెస్ట్‌.. అంటూ పెద్ద రచ్చే జరిగింది. యంగ్‌ హీరో తరుణ్‌ విషయంలో అయితే ఈ రగడ ఇంకాస్త ఎక్కువే కన్పించింది. చివరికి ఆ కేసు అలా అలా 'అజ్ఞాతంలోకి' వెళ్ళిపోయింది.

దాదాపు రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఈ కేసు తెరపైకొచ్చింది. సమాచార హక్కు చట్టం కింద వాస్తవాల్ని వెలికితీసేందుకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ప్రయత్నించడం, దాంతో కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు పొక్కడం చకచకా జరిగిపోయాయి. అయితే, ఇవి ఏడాది క్రిందటి వివరాలని, కొత్త విషయాలేమీ ఇందులో లేవని అధికారుల నుంచి సమాచారం అందుతోంది. అధికారుల వెర్షన్‌ని పక్కన పెడితే, తాజా వివరాల ప్రకారం సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ కేసులో దాదాపు క్లీన్‌ చిట్‌ లభించినట్లే అర్థమవుతోంది.

మొత్తం 62 మందిని ఈ కేసులో విచారిస్తే, అందులో వున్న 12 మంది సినీ ప్రముఖుల్ని కేవలం బాధితులగానే చూపారు. దాంతో, సినీ పరిశ్రమ ప్రస్తుతానికి ఈ 'టాలీవుడ్‌ డ్రగ్స్‌ రచ్చ' నుంచి బయటపడినట్లేనన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. మరోపక్క, ఇప్పటిదాకా 4 చార్జి షీట్లు మాత్రమే వేయడం జరిగిందనీ, ఈ కేసులో మరిన్ని ఛార్జిషీట్లకు అవకాశం వుందని పోలీస్‌ అధికారులు చెబుతున్నారు.

ఏదిఏమైనా, రెండేళ్ళ క్రితంనాటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. 'విచారణను ఎదుర్కొంటోన్నవారిలో ఎవరూ తప్పించుకునే ప్రసక్తేలేదు..' అన్నట్లుగా అప్పట్లో హడావిడి జరిగింది, ఇప్పుడేమో మొత్తం వ్యవహారం నీరుగారిపోయింది. చూద్దాం.. ఈ కేసు ఇంకెన్నాళ్ళు ఇలాగే కొన'సాగు'తుందో.!  

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!