సిఎమ్ జగన్ అలా అడిగారా?

టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆంధ్ర సిఎమ్ జగన్ దగ్గరకు టాలీవుడ్ డెలిగేషన్ ను పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ డెలిగేషన్ లో హీరోలు ఎవ్వరూ వుండకపోవచ్చు. ఇక్కడ సమస్య ఎవరిది? థియేటర్ల…

టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆంధ్ర సిఎమ్ జగన్ దగ్గరకు టాలీవుడ్ డెలిగేషన్ ను పంపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ డెలిగేషన్ లో హీరోలు ఎవ్వరూ వుండకపోవచ్చు. ఇక్కడ సమస్య ఎవరిది? థియేటర్ల యజమానులది. కానీ ఇక్కడ మళ్లీ మరో చిన్న ట్విస్ట్ వుంది. టికెట్ రేట్లు పెరిగినా, వాళ్లకు వచ్చే అద్దెలు లేదా లీజ్ అమౌంట్లు మారవు. అలాంటపుడు కష్టపడి సిఎమ్ ను ఒప్పించి మరీ ఎక్కువ రేట్లు తెచ్చి ప్రయోజనం ఏమిటి? 

అందుకే మహా అయితే ఓ పది శాతం పెంచమని అడిగితే చాలు అనే ఆలోచనతో థియేటర్ల జనాలు వున్నారు. కానీ అలా అయితే తమకు చాలదు అన్నది నిర్మాతల ఆలోచన. అందుకే ఎగ్జిబిటర్లను ఒప్పించి, ఏం అడగాలో? ఎలా అడగాలో నేర్పించి, సిఎమ్ దగ్గరకు పంపించే ఆలోచన చేస్తున్నారు.

థియేటర్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న రేట్ల మీద ఎంత ఆదాయం వస్తుంది. ఇలా అయితే ఎంత నష్టం వస్తుంది అన్నవి అన్నీ ఓ ఫైల్ తయారుచేసి సిఎమ్ కు అందించాలని కసరత్తు జరుగుతోంది. అయితే ఇక్కడ హీరోలను అస్సలు ఇన్ వాల్వ్ చేయకూడదని డిసైడ్ అయినట్లు బోగట్టా. దానికి ఓ కారణం వుందని టాలీవుడ్ లో వినిపిస్తోంది. 

టికెట్ రేట్లు పెంచడం ద్వారా వస్తున్న అదనపు ఆదాయం అంతా ఎక్కడకు వెళ్తోంది? హీరోల జేబుల్లోకే కదా? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు బావుకునేది ఏమీ లేదు కదా? అని సిఎమ్ జగన్ నేరుగా తనను కలిసి కొందరు సినిమా జనాలను నేరుగా, స్పష్టంగా అడిగారని టాలీవుడ్ లో వినిపిస్తోంది. 

ఇప్పుడు నిర్మాతలు వెళ్లినా 'ఏం సినిమా తీసావ్..హీరోకి ఎంత ఇచ్చావ్..నీకు ఏం మిగిలింది' అని ఆరా తీస్తే కష్టం అవుతుంది. హీరోలు వెళ్తే మీ రెమ్యూనిరేషన్లు తగ్గించుకోవచ్చు కదా అని అడిగినా అడిగేస్తారు. జగన్ వ్వవహారశైలి అలాగే వుంటుంది. 

అందుకే ఎగ్జిబిటర్లే బాధితులు అనే కలరింగ్ తయారుచేసి, ఎగ్జిబిటర్లనే సిఎమ్ దగ్గరకు పంపించాలని ఎత్తు వేసారు టాలీవుడ్ పెద్దలు. ముందుగా విజయవాడలో ఓ ఎగ్జిబిటర్ల సమావేశం నిర్వహించి, అక్కడ నుంచి డెలిగేట్స్ ను సిఎమ్ దగ్గరకు పంపాలన్నది ప్లాన్. 

సురేష్ బాబు ఆలోచన

ఇలాంటి నేపథ్యంలో ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు ఆలోచన వేరుగా వుంది. మల్టీ ఫ్లెక్స్ లకు ఏ విధంగా అయితే 55-45 లేదా 60-40 నిష్పత్తిలో పర్సంటేజ్ విధానం వుందో, దాన్నే అన్ని థియేటర్లకు అమలు చేయించాలనే ఆలోచన చేస్తున్నారని బోగట్టా. కానీ దానికి నిర్మాతలు అంగీకరించడం లేదు. 

మల్టీ ఫ్లెక్స్ లు వాటి సదుపాయాలు వేరు, సింగిల్ స్క్రీన్ లు వేరు. నిర్వహణ ఖర్చులు తేడా వుంది. అందుకే ఆ విధంగా పర్సంటేజ్ ఇవ్వలేమని, 80-20 వంతున కొత్త, పెద్ద సినిమాలకు ఇవ్వడానికి ఓకె అని నిర్మాతలు అంటున్నారు. ఇది ఇలా నలుగుతోంది.

కోర్టుకు వెళ్లంది అందుకే

నిజానికి అన్నింటికీ కోర్టులకు వెళ్లిపోయి, స్టేలు తెచ్చుకున్నట్లే ప్రభుత్వ టికెట్ ల జీవో మీద కూడా స్టే తెచ్చుకోవచ్చు. అదేమంత కష్టం కాదు. కానీ అప్పుడు ప్రభుత్వాన్ని కాదన్నట్లు అవుతుంది. నియమ నిబంధనలు పక్కాగా అమలు చేస్తే ఒక్కటంటే ఒక్క సింగిల్ థియేటర్ రన్ అవదు. 

బాత్ రూమ్ ల శుభ్రత, ఫైర్ సేఫ్టీ, ఇతరత్రా అనేక నియమ నిబంధనలను అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటే అధికారులు నియమ నిబంధనలను బయటకు తీస్తారని ఎగ్జిబిటర్లు భయపడుతున్నారు. అలా చేస్తే చాలా థియేటర్లు మూతపడతాయి. అందుకే జగన్ ను కలిసి, ఏదో విధంగా బతిమాలుకుని, టికెట్ రేట్లు పెంచుకోవాలని కిందా మీదా అవుతున్నారు. 

నో మీడియేటర్

మరే ప్రభుత్వంలో అయినా ఎవరో ఒకరు పూనుకుని సిఎమ్ దగ్గర లాబీయింగ్ చేయడానికి అవకాశం వుంటుంది. జగన్ దగ్గర ఇలా ఎవ్వరూ లేరు. జగన్ ఆలోచించి, జగన్ నిర్ణయించాల్సిందే. విజయసాయి, సజ్జల, వైవి ఎవ్వరికీ అంత చాన్స్ లేదు. పైగా మరో రెండు నెలల్లో మంత్రి వర్గ మార్పులు చేర్పులు వున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో జగన్ దగ్గరకు వెళ్లి టికెట్ రేట్ల గురించి మాట్లాడేంత ధైర్యం ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి చేయరు. పైగా హీరోల రెమ్యూనిరేషన్ల లెక్కలు, సినిమాల లెక్కలు అన్నీ జగన్ కు తెలుసు. సమస్య మీద ఆయన ఫుల్ క్లారిటీ వుంది. 

అందుకే ఇక ఏం చేసేది లేక ఎగ్జిబిటర్ల ద్వారానే పని జరిపించుకోవాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.