మరో మూడు నెలల్లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రసవత్తరంగా సాగునున్నాయి. సాధారణ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సినిమా ఎన్నికలు నువ్వా? నేనా? అన్న రేంజ్‌లో పోటీ తీవ్రతరమవుతోంది. 'మా' అధ్యక్ష రేస్‌లో ఊహించని నటులు నిలుస్తున్నారు. తాజాగా 'మా' అధ్యక్ష రేస్‌లో సీనియర్ నటి హేమ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇప్పటికే 'మా' అధ్యక్ష రేస్‌లో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, యువహీరో మంచు విష్ణు, సీనియర్ నటీమణి జీవితా రాజశేఖర్‌లు న్నారు. వీరి సరసన నాలుగో పోటీదారుగా నటి హేమ పేరు ఖరారైంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో తనను సపోర్ట్ చేసిన వారి కోరిక మేరకు… ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నట్టు హేమ ప్రకటించడంతో ఇద్దరు మహిళా నటులు ఎన్నికల తెరపైకి వచ్చినట్టైంది.
తాను బరిలో నిలుస్తున్న సంగతిని వెల్లడించేందుకు హేమ మీడియాతో మాట్లాడారు. తాను `మా` ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టినట్టు తెలిపారు. తాను చేపట్టిన పదవులకు న్యాయం చేశానన్నారు. ఈ సారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు రానే వచ్చాయన్నారు.
నిజానికి ఈ దఫా ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని ముందుగా అనుకున్నట్టు మనసులో మాట తెలిపారు. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు బాబు, జీవిత తదితర పెద్దలంతా అధ్యక్ష బరిలో దిగుతున్నారని తెలిశాక.. పెద్దల వివాదాల్లో మనమెందుకు చిక్కుకోవాలని అనుకున్నట్టు తెలిపారు. దీంతో అసలు పోటీ చేయవద్దనే అనుకున్నట్టు హేమ చెప్పారు.
అయితే సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి 'నువ్వెందుకు పోటీ చేయకూడదు? నువ్వుంటే బాగుంటుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా అర్థ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అందుకే నువ్వు కావాలి' అని అడుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోటీ చేయాలని తన వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారన్నారు.
ఇండిపెండెంట్‌గా పోటీ సమయంలో తనకు అండగా నిలిచిన వారందరి కోసం పోటీ చేయాలనుకుంటున్నట్టు హేమ ప్రకటించడం టాలీవుడ్‌లో పొలిటికల్ హీట్ పెంచింది. సీనియర్ నటి హేమ ముక్కుసూటిగా మాట్లాడ్తారని పేరు. బిగ్‌బాస్ రియాల్టీ షోకి వెళ్లి అనూహ్యంగా మొదట్లోనే వెనుతిరిగి తీవ్ర నిరాశకు గురయ్యారామె. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. 'మా' అధ్యక్ష రేస్‌లో హేమ ఏ మాత్రం ప్రభావం చూపుతారో చూడాల్సి వుంది.