ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి సారధిగా చివరి కేబినెట్ భేటీని నిర్వహించబోతున్నారు. ఈనెల 23న ఫలితాలు, తెలుగుదేశానికి అనుకూలంగా రాకపోతే గనుక… ఆయనకు ఇదే చిట్టచివరి కేబినెట్ భేటీ అవుతుంది. ఆ నేపథ్యంలో ఈ కేబినెట్ కు ప్రాధాన్యం పెరిగింది. ఈసీ ఆంక్షలు నిబంధనల మధ్య నిర్వహిస్తున్న భేటీని, రాజకీయ మైలేజీకోసం ఉపయోగపడేలా చంద్రబాబునాయుడు వాడుకుంటారా? లేదా, ఎజెండాలోని అంశాలకే పరిమితమై ఉంటారా? అనేది చర్చనీయాంశం అవుతోంది.
చంద్రబాబు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించనున్న కేబినెట్ భేటీలో టేబుల్ ఐటెంగా ఈసీ అనుమతి లేని అంశాలను చర్చకు పెట్టడానికి ప్రయత్నిస్తారో లేదో చూడాలి. బాబు కేబినెట్ విషయంలో ఈసీ తొలినుంచి ఆంక్షలు విధించింది. కీలక నిర్ణయాలు తీసుకోరాదు అనేది నిబంధన. అయితే ఫొని తుపాను నేపథ్యంలో… రాష్ట్రానికి నష్టం జరిగిందని… సాయంపై కేబినెట్ భేటీ అవసరం అని చంద్రబాబు రాద్ధాంతం చేశారు. మొత్తానికి తుపాను దాటిపోయిన రెండువారాల తరువాత… కేబినెట్ భేటీ జరుగుతోంది.
ఎజెండా అంశాలను ముందే స్క్రూటినీ చేసి మరీ.. ఈసీకి పంపారు. మొత్తానికి ఈసీ అనుమతించింది. కీలక నిర్ణయాలు తీసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోడానికి కూడా వీల్లేదని ఆదేశించింది. నిజానికి ఆ ఆదేశంలో పసలేదు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టకపోయినా.. యావత్ చర్చను పూస గుచ్చినట్టుగా ప్రెస్ కు లీక్ చేయగల లీకువీరులు అధికార, అమాత్య గణంలో పుష్కలంగానే ఉంటారు.
కాకపోతే.. టేబుల్ ఐటెంగా చంద్రబాబు సర్కార్ ఈసీ అనుమతి లభించే అవకాశం లేని పాయింటు దేనినైనా కేబినెట్ లో చర్చకుపెట్టే అవకాశం ఉంది. సహజంగానే దీనికి చీఫ్ సెక్రటరీ అడ్డు చెప్పవచ్చు. అయితే… చంద్రబాబు అలాంటి వివాదాన్నే కోరుకుంటారు.
ఎన్నికలు ముగిసిన నాటినుంచి చీఫ్ సెక్రటరీ మీద, ఈసీ మీద కారాలు మిరియాలు నూరుతున్న చంద్రబాబు… ఈ రకంగా ఈసీ తనను అడ్డుకుంటున్నదని… ఆరోపించడానికి మరో అవకాశం సృష్టించుకుంటారనే వాదన కొందరినుంచి వినిపిస్తోంది. అందుకే ఈ కేబినెట్ భేటీలో టేబుల్ ఐటెం ఉంటుందా లేదా అని పలువురు చర్చించుకుంటున్నారు.
వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!