గత మూడేళ్లలో వైఎస్ జగన్ పరిపాలనలో అన్ని రంగాలు ధ్వంసమయ్యాయని ప్రతిపక్షాల విమర్శ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు జగన్ పాలనలో రియల్ ఎస్టేట్ కుదేలు కాకపోగా, ఎంతో పురోగతి సాధించిందని గణాంకాలు చెబుతున్నాయి.
గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల రూపంలో రాష్ట్ర ఖజానాకు రూ.715 కోట్లు ఆదాయం అదనంగా సమకూరింది. ఈ ఏడాది జూలై వరకూ రిజిస్ట్రేషన్ల రూపంలో ఖజానాకు మొత్తం రూ.2,655 కోట్లు ఆదాయం వచ్చింది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్లు ఏ స్థాయిలో జరిగాయో అర్థం చేసుకోవచ్చు. జగన్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అనే చందంగా విరాజిల్లుతోంది.
ఈ రోజు ఉన్న భూమి విలువ, రేపటికి వెళ్లే సరికి పెరుగుతోంది. దీంతో స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి మధ్యతరగతి, ఉన్నత వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పది రూపాయలు చేతిలో వుంటే వడ్డీలకు ఇచ్చేవాళ్లు. అయితే వడ్డీలకు తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో మొండిచేయి చూపుతున్న పరిస్థితి. దీంతో అనవసర తలనొప్పులు ఎందుకని తమ దగ్గరున్న సొమ్ముకు ఎంతోకొంత స్థలం కొంటే, కాలం గడిచేకొద్ది అదే మంచి ప్రాపర్టీ అవుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో పెరుగుతోంది. ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెడుతోంది.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఏపీలో స్థిరాస్తి వ్యాపారానికి వచ్చిన నష్టం లేదు. జగన్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడి హైదరాబాద్, బెంగళూరులకు వెళుతున్నారనే ప్రచారంలో నిజం లేదని గత ఏడాది కంటే ఈ ఏడాది అధికంగా వచ్చిన రూ.715 కోట్ల అదనపు ఆదాయమే నిదర్శనం. జగన్ సుపరిపాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.