తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలో భయాన్ని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులున్నాయని, మరోసారి అధికారంలోకి తప్పక వస్తామనే నమ్మకానికి బదులు, ఏమవుతుందోననే భయం జగన్‌లో వుంటే మంచి జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
గత మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయాల్ని సాధించింది. దీంతో వైసీపీ నేతల్లో ఆత్మవిశ్వాసానికి బదులు అతి విశ్వాసం నెలకుందనే భయం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో గడపగడపకూ మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించడం పార్టీ శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను గత మూడేళ్లలో 95 శాతం నెరవేర్చామని, ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసి మరోసారి ఆశీస్సులు కోరాలని జగన్ ఆదేశించారు.
ముఖ్యమంత్రిగా తనకు 60 శాతం మార్కులు వేశారని, కానీ ఎమ్మెల్యేల పరిస్థితే అంత బాగాలేదని జగన్ భావన. పైకి జగన్ ఎన్ని చెబుతున్నా, మరో రెండేళ్లలో ప్రజాతీర్పుపై జగన్ ఆందోళనగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌లో ఈ భయాన్నే వైసీపీ కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రజల తీర్పుపై జగన్‌లో భయం వుంటే, ఒళ్లు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారని వారు అంటున్నారు.
ఒకవేళ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత ఎదురైతే, అలాంటి వాటిపై సీఎం జగన్ పునరాలోచన చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిర్ణయాలపై రానున్న రోజుల్లో అధికారం రావడం, రాకపోవడం అనేది ఆధారపడి వుంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
జగన్ పదేపదే గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షలు జరపడం, లోటుపాట్లను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు తెలియజేస్తూ, తప్పులను సరిదిద్దుకునేలా చేయడం వెనుక… ఆయన్ను భయం వెంటాడమే కారణమంటున్నారు.
అలాగే రెండేళ్లు ముందుగానే ఎమ్మెల్యేలు, తన పనితీరుపై ఎప్పటికప్పుడు వివిధ సంస్థలతో సర్వేలు చేయిస్తూ, నివేదికలు తెప్పించుకోడానికి కారణం జగన్‌లోని భయమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరిలోనైనా భయం వుంటేనే కాస్త జాగ్రత్తగా మసులుకుంటారని, జగన్‌లో కూడా అదే చూస్తున్నామనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.