నారాలోకేష్.. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు!

నారాలోకేష్ తన వ్యాపారాన్ని- రాజకీయాన్ని ముడిపెడుతున్నారు. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలకు, వాటిని అధిగమించలేని చేతకానితనానికి రాజకీయంతో ముడిపెట్టి.. ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేస్తున్న సమయంలో.. తన తండ్రి నారా చంద్రబాబునాయుడు…

నారాలోకేష్ తన వ్యాపారాన్ని- రాజకీయాన్ని ముడిపెడుతున్నారు. వ్యాపారంలో ఎదురయ్యే నష్టాలకు, వాటిని అధిగమించలేని చేతకానితనానికి రాజకీయంతో ముడిపెట్టి.. ప్రత్యర్థులపై విమర్శలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి విమర్శలు చేస్తున్న సమయంలో.. తన తండ్రి నారా చంద్రబాబునాయుడు చరిత్రను కూడా మర్చిపోతున్నారు. 

గురివింద గింజ తన వెనుక ఉన్న నలుపు ఎరగనట్టుగా.. తమ వెనుక చరిత్రలోని వాస్తవాలని ప్రజలందరూ కూడా మరచిపోయి ఉంటారనే అనుకుంటూ.. నారా లోకేష్ చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. 

చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామంలో రైతులనుంచి పాలు సేకరిస్తున్న ఒక శ్రీజ డెయిరీ ఆగస్టు ఒకటో తేదీనుంచి పాలసేకరణ నిలిపివేస్తున్నట్టుగా వారికి ముందుగానే తెలియజేసింది. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని కూడా చెప్పింది. అయితే అక్కడి రైతులు ఆ విషయం పట్టించుకోలేదు. సోమవారం ఆటో రాకపోయేసరికి.. ఈ పాలు మేమేం చేసుకోవాలంటూ.. వాటిని రోడ్డు మీద పారబోసి నిరసన తెలియజేశారు. ఇదీ సంఘటన! అయితే దీనికి రెండు రకాలుగా తెలుగుదేశం వారు కథలు అల్లుతున్నారు. 

తమ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైనందున.. తమ గ్రామంలో పాలసేకరణ నిలిపేయాల్సిందిగా శ్రీజ డెయిరీపై, మంత్రి పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన శివశక్తి డెయిరీ వారు ఒత్తిడి తెచ్చి ఇలా చేయించారనేది అక్కడి రైతుల కథనంగా పత్రికల్లో వచ్చింది. ఒక డెయిరీ వారి పాలసేకరణ వ్యవహారాల్లో రెండో డెయిరీ వారు ఎలా జోక్యం చేసుకుంటారనేది వేరే చర్చ!

అయితే, ఇదే ఘటనకు నారా లోకేష్ మరొక భాష్యం చెబుతున్నారు. శివశక్తి డెయిరీ పాల రైతులకు చాలా తక్కువ ధర ఇస్తోందని, అధికధర ఇచ్చి పాలు కొనేలా ఇతర డెయిరీలు ముందుకు వస్తే పెద్దిరెడ్డి మనుషులు బెదిరించి పంపేస్తున్నారనేది లోకేష్ ఆరోపణ. అందువల్ల పాడి రైతులు రోడ్ల మీద పాలు పారబోస్తున్నారని ఆయన కొత్త కథ చెబుతున్నారు. ఇదే నిజమైతే శివశక్తి డెయిరీ మనుషులు ప్రతిచోటా ఇతర డెయిరీలు అధికధర చెల్లించి కొనకుండా అడ్డుపడాలి కదా అనేది ఒక వాదన. 

పుక్కిటి పురాణాల్లగా ఉన్న ఆరోపణలతో కూడిన ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా పక్కన పెడదాం. లోకేష్ కు చెందిన హెరిటేజ్ డెయిరీ పరిస్థితి ఏమిటి? పాడి పరిశ్రమలో ఎంతో పేరుమోసిన చిత్తూరు జిల్లా సహకార డెయిరీని కేవలం తన సొంత వ్యాపారం హెరిటేజ్ డెయిరీ కోసం సర్వనాశనం చేసిన ఘనమైన చరిత్ర చంద్రబాబునాయుడుది. 

ఇప్పుడు చిత్తూరు సహకార డెయిరీ నామరూపాలు లేకుండా పోవడానికి ఏకైక కారకుడు చంద్రబాబునాయుడు! పాడి వ్యాపారుల పొట్టకొట్టడం మాత్రమే కాదు.. వారికి దన్నుగా ఉన్న సహకార డెయిరీని సర్వనాశనం చేసేశారు. అలాంటి చరిత్ర కలిగిఉన్న హెరిటేజ్ వ్యాపార వారసుడు లోకేష్.. ఒక్క గ్రామంలో రైతుల ఆందోళనను, రెండు డెయిరీల మధ్య గొడవలాగా.. ఒక రాజకీయ వివాదంలాగా మార్చడానికి ప్రయత్నించడం చాలా నీచంగా ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు.