వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ త‌ప్ప‌దా?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అరెస్ట్ త‌ప్ప‌దా? అంటే తప్ప‌క పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యాన్ని త‌న అనుచ‌రుల వ‌ద్ద ఆమంచి చెబుతున్న‌ట్టు…

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ అరెస్ట్ త‌ప్ప‌దా? అంటే తప్ప‌క పోవ‌చ్చ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే విష‌యాన్ని త‌న అనుచ‌రుల వ‌ద్ద ఆమంచి చెబుతున్న‌ట్టు స‌మాచారం. జ‌డ్జిల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌నే కార‌ణంతో ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌పై సీబీఐ కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. విచార‌ణ నిమిత్తం రావాల‌ని ఆమంచికి సీబీఐ ఆమంచికి నోటీసు ఇచ్చింది. త‌న‌పై సీబీఐ న‌మోదు చేసిన కేసు కొట్టివేయాల‌ని ఆమంచి న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

అయితే విచార‌ణ‌కు వెళ్ల‌డానికి ఆమంచి త‌ట‌ప‌టాయిస్తున్నారు. స‌హ‌జంగా టీడీపీ నేత‌ల‌పై సీఐడీ కేసులు న‌మోదు, విచార‌ణ‌కు సంబంధించి హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేయ‌డాన్ని గుర్తించుకోవాలి. అరెస్ట్ లాంటి చ‌ర్య‌లొద్ద‌ని, ఒక్కోసారి సీఐడీ కేసుల‌పై హైకోర్టు స్టే కూడా విధించింది. ఇదే ర‌క‌మైన సానుకూల తీర్పు వ‌స్తుంద‌ని ఆమంచి ఆశించారు.

అయితే కేసు విచార‌ణ‌లో భాగంగా వాయిదా వేస్తున్నారే త‌ప్ప‌, ఆమంచి కోరుకున్న‌ట్టు అరెస్ట్ నుంచి మిన‌హాయింపు రాక‌పోవ‌డం ఆయ‌న‌లో ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు ఈ కేసు తీవ్ర‌మైంద‌ని , విచార‌ణ‌కు అనుమ‌తించాల‌ని సీబీఐ త‌ర‌పు హైకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆమంచిని ఈ నెల 5న విచారించ‌నున్న‌ట్టు హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

ఈ మేర‌కు మాజీ ఎమ్మెల్యేకి సీఆర్‌పీసీ సెక్ష‌న్ 41ఎ నోటీసు ఇచ్చిన‌ట్టు కోర్టుకు సీబీఐ చెప్పింది. అయితే మ‌రో తేదీని ఇవ్వాల‌ని పిటిష‌న‌ర్ తర‌పు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. ఇందుకు హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ జ‌య‌సూర్య నిరాక‌రించారు. ఇదిలా వుండ‌గా విచార‌ణ‌ను ఈ నెల 8 వాయిదాకు వేశారు. ఏ ద‌శ‌లోనూ పిటిష‌న‌ర్‌కు సానుకూల నిర్ణ‌యం రాలేదు. మ‌రోవైపు జ‌డ్జిల‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌ను న్యాయ వ్య‌వ‌స్థ సీరియ‌స్‌గా తీసుకోవ‌డంతో ఆమంచికి సంబంధించి ప‌రిణామాల‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే న్యాయ‌మూర్తుల‌పై సోష‌ల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ప‌లువురిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వారి జాబితాలోకే ఆమంచి కూడా చేరుతారా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.