శివసేన ముఖ్య నేత సంజయ్ రౌత్ ను ఈడీ అదుపులోకి తీసుకున్న కేసు పేరు పత్రా చాలా రీడెవలప్ మెంట్ కేసు. ఇదొక హౌసింగ్ స్కామ్. దీని సూత్రధారి అయితే అభియోగాల ప్రకారం సంజయ్ రౌత్ కాదు.
సంజయ్ రౌత్ కు సమీప బంధువు ఒకరు ఈ కేసులో సూత్రధారి అని అభియోగాలు నమోదయ్యాయి. మరి దగ్గరి బంధువు సూత్రధారి అయితే రౌత్ ను అరెస్టు చేసేవచ్చా.. అంటే, సదరు సూత్రధారి భార్య అకౌంట్ నుంచి సంజయ్ రౌత్ భార్య అకౌంట్ 83 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయట! ఇందుకు గానూ.. రౌత్ ను అదుపులోకి తీసుకుంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్!
మరి రౌత్ భార్య అకౌంట్లోకి డబ్బులు బదిలీ అయితే.. ఆమెను కదా అరెస్టు చేయాలి? అంటే.. అలా చేస్తే శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే వర్గంపై సానుభూతి వస్తుంది తప్ప, ప్రస్తుత మహారాష్ట్ర సర్కారుకు ఒకగూరేది ఏమీ ఉండదని వేరే చెప్పనక్కర్లేదు. ఈడీ మోపిన అభియోగాల ప్రకారం.. సంజయ్ రౌత్ ఫ్యామిలీ ఆ స్కామ్ నుంచి సుమారు కోటి రూపాయల లబ్ధి పొందింది! సూటిగా చెబుతున్న అంశం.. ఆ స్కామ్ లో లబ్ధిదారు సంజయ్ రౌత్ వ్యక్తిగతంగా కాదు. రౌత్ కుటుంబం!
ఆ స్కామ్ మొత్తం విలువ 1200 కోట్ల రూపాయలు అని ఈడీ తన చార్జిషీట్లో పేర్కొంది. అదో హౌసింగ్ సొసైటీ స్కామ్. రీడెవలప్ మెంట్ పేరుతో స్థలాలేవో తీసుకుని, వాటి ఓనర్లను మోసం చేశారనేది కీలకమైన అభియోగం. తమకు డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వక, కొత్తగా నిర్మించిన ఫ్లాట్లనూ ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు దీరగానే.. మనీలాండరింగ్ అంటూ రౌత్ అరెస్టు జరిగింది.
మరి మోడీ, షా ల మీద విరుచుకుపడే రాతలు రాసిన రౌత్ ను మూసేయడానికి ఇంత కన్నా పెద్ద స్కామ్ దొరకలేదా! అనేది ఆశ్చర్యం. ఈడీ అభియోగాల ప్రకారమే.. ఈ కేసులో రౌత్ వాటా కోటి రూపాయల్లోపు! అది కూడా ఆయన అకౌంట్ లోకి రాలేదు. ఆయన భార్య అకౌంట్ లోకి! అది కూడా ఈ స్కామ్ కు సూత్రధారి భార్య అకౌంట్ నుంచి. చట్ట ప్రకారం.. ఇలా భార్య అకౌంట్ లోకి అక్రమ డబ్బే పడిందంటే.. భర్తను అరెస్టు చేయవచ్చా? అనేది ధర్మసందేహం!
ఈ కేసులో విచారణకు ఎనిమిది రోజుల పాటు రౌత్ ను కస్టడీలోకి కోరిందట ఈడీ. అయితే ఎలాగూ ఎనిమిది రోజులు సరిపోకపోవచ్చు. రౌత్ వంటి కరడుగట్టిన జర్నలిస్టును విచారించాలంటే ఎనిమిది రోజులుగాక.. ఎనభై రోజుల సమయం అయినా ఈడీకి తక్కువే! కాబట్టి.. ఈడీ అదుపు నుంచి రౌత్ ఇప్పుడప్పుడే బయటకు రావడం కష్టమేనేమో!