బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ చేసిన నగ్న ఫొటో షూట్ ఒక పైత్యం. అంతకు మించి అందులో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే అతడు ఒక పూట నగ్న పోజులు ఇస్తే.. దాన్ని వ్యతిరేకించే వాళ్లు మాత్రం పూటపూటకూ అదే రూపాన్ని తలుచుకుంటున్నారు పాపం! అతడు తప్పు చేశాడని నిరూపించడానికి వీరు పడుతున్న అపసోపాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే ఎక్కడెక్కడో రణ్ వీర్ పై కేసులు నమోదయ్యాయి.
మరి బాలీవుడ్ హీరో నగ్న పోజులు ఇస్తే ఆ మాత్రం ప్రచారం కల్పించకపోతే దేశ జనులకు మరీ బాధ్యత లేనట్టు కదా! ఇక ఈ వ్యవహారంలో దీపికను తిట్టే వారు అలుపు లేకుండా పని చేస్తూ ఉన్నారు. అతడో హీరో.. అతడు చేసిన పనికి అతడి భార్యను అంటే కానీ వీరికి మనశ్శాంతి ఉండదు పాపం!
ఒక బాలీవుడ్ ను హిందూ వ్యతిరేక సంఘంగా చూసే జనాలకూ కొదవలేదు. దీంతో వీరు రణ్ వీర్ సింగ్ వేషాలను అస్సలు సహించలేకపోతూ ఉన్నారు. అంతపని చేస్తాడా.. అంటూ పది రోజులుగా వీరు ఆయాస పడుతూనే ఉన్నారు.
ఇక రణ్ వీర్ పై వచ్చే విమర్శలతో లైవ్ బ్లాగ్ ను నడుపుతోంది నార్తిండియన్ మీడియా. అతడి నగ్న షోపై ఏ హీరోయిన్ ఏమంది? ఏ హీరో ఏమన్నాడు? అనేవి ఇందులో హెడ్ లైన్స్. మీడియా ముందుకు వచ్చే బాలీవుడ్ సెలబ్రిటీనీ.. రణ్ వీర్ నగ్న షో గురించి స్పందించమనేది తప్పనిసరి కొశ్చన్ గా మారింది. కరీనా కపూర్, అలియా భట్, సారా అలీఖాన్.. వీరంతా తలా ఒక మాట అయినా చెప్పకతప్పని పరిస్థితి కల్పిస్తోంది మీడియా!
మరి రణ్ వీర్ షో ను అంత వ్యతిరేకించే వాళ్లు సింపుల్ గా దాన్ని ఇగ్నోర్ చేయవచ్చు. అదో వెర్రిగా భావించి ఊరుకోవచ్చు. అయితే దానిపై పీకిపాకం పెడితే కానీ.. వీరు ప్రశాంతత పొందలేకపోతున్నారు. మరి దీని వల్ల రణ్ వీర్ లక్ష్యం కావొచ్చు, అతడి చేత ఆ పోజులు ఇప్పించిన వారి లక్ష్యం కావొచ్చు.. దక్కుతున్న ప్రచారంతో నెరవేరుతోంది!