ఇది వరకూ చాలా మంది సినిమా హీరోలు సొంతంగా ఎంటర్ టైన్ మెంట్ టీవీ చానళ్ల వ్యాపారంలోకి దిగారు. తెలుగులో కూడా నాగార్జున, చిరంజీవి జాయింటుగా మా టీవీ యజమానులుగా నిలిచారు. ఆ తర్వాత ఆ చానల్ ను మంచి లాభాలకు స్టార్ నెట్ వర్క్ కు అమ్మేసుకుని, ఒప్పందం ప్రకారం మళ్లీ చానల్ ఏదీ ప్రారంభించకుండా కామ్ గా ఉన్నారు. సక్సెస్ ఫుల్ మీడియా హౌస్ లను అమ్మే చాలా మంది మళ్లీ కొన్నేళ్ల పాటు ఆ రంగంలోకి దిగకూడదు అనే షరతులకు లోబడే అమ్ముతుంటారు. ఆ క్రమంలో నాగ్, చిరులు కూడా కొత్త చానల్ ఇప్పటి వరకూ స్టార్ట్ చేసే ఆలోచనలు కూడా ఏవీ చేసినట్టుగా లేరు.
ఆ సంగతలా ఉంటే.. ఈ తరంలో చానళ్ల కన్నా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ లకే ఊపు వస్తోంది. రాబోయే రోజులు పూర్తిగా డిజిటల్ స్ట్రీమింగ్ దే హవా ఉంటుందని, వెబ్ సీరిస్ లు రాజ్యం ఏలతాయనే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా హీరోలు ఈ వ్యాపారంలోకి దిగుతూ ఉన్నారు. ఇప్పటికే తెలుగు సినిమా వాళ్లు *ఆహా* అంటూ ఒక యాప్ మొదలెట్టారు.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మహేశ్ బాబు కూడా ఈ వ్యాపారంలోకి దిగుతున్నాడని, ముంబైలోని ఒక వ్యాపార సంస్థతో కలిసి మహేశ్ బాబు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ను ప్రారంభించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ పత్రికలే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాయి. దీని కోసమని మహేశ్ కొన్ని సినిమాలను కూడా తీయిస్తాడని, వెబ్ సీరిస్ లు కూడా ప్లాన్లో ఉన్నాయని సమాచారం.
మొత్తానికి ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి అవి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లు ఈ విషయంలో స్పష్టమైన లీడ్ లో కనిపిస్తున్నాయి. మిగతావి ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వాటికి తోడు మహేశ్ తరఫున కూడా ఒకటి రంగంలోకి దిగుతున్నట్టుంది!