జ‌గ‌న్ స‌ర్కార్‌కు అస‌లు ప‌రీక్షిదే!

కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రీ మొండి ప‌ట్టుద‌ల‌కు పోతూ అన‌వ‌స‌ర త‌ల‌వంపులు తెచ్చుకుంటోంది. ఇటీవ‌ల కాలంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి స‌హ‌జంగానే విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.…

కొన్ని విష‌యాల్లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌రీ మొండి ప‌ట్టుద‌ల‌కు పోతూ అన‌వ‌స‌ర త‌ల‌వంపులు తెచ్చుకుంటోంది. ఇటీవ‌ల కాలంలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి స‌హ‌జంగానే విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి టీడీపీ ట్రాప్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌డింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్‌తో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చేసిన ఆన్‌లైన్ పోరాటం, ఆ పార్టీకి రాజ‌కీయంగా లాభించింది. ఇదే స‌మ‌యంలో అధికార వైసీపీకి ఎంతోకొంత న‌ష్టం వాటిల్లింద‌నే అభిప్రాయాలు లేక‌పోలేదు. విద్యార్థుల ప్రాణాల‌తో ప్ర‌భుత్వం ఎందుకు చెల‌గాటం ఆడుతోంద‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్ర‌మంలో ప‌రీక్ష‌ల వ్య‌వ‌హారం చివ‌రికి సుప్రీంకోర్టు వ‌ర‌కూ వెళ్లింది. ఏపీతో పాటు కేర‌ళ కూడా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మొండిగా ముందుకెళ్ల‌డంపై సుప్రీంకోర్టు అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి మున్ముందు పెద్ద ప‌రీక్ష పెట్ట‌బోతున్నాయ‌ని చెప్పొచ్చు.

బోర్డు పరీక్షల నిర్వహణతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు హెచ్చరించడం గ‌మ‌నార్హం. పరీక్షల విషయంలో విద్యార్థుల్లో అయోమ‌య్యాన్ని ఎందుకు సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.  

సీబీఎస్ఈ, సీఐఎస్‌సీఈ సహా రాష్ట్రాల బోర్డు పరీక్షల రద్దుపై దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ ఏ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారణ సంద‌ర్భంగా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం ఏపీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మ‌రో వైపు ఆఖరి నిమిషంలో పరీక్షలు రద్దు చేయకూడదని ధర్మాసనం స్ప‌ష్టం చేసింది. నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నా రని… పరీక్షలు నిర్వహించాలనే పట్టుదల మీకు ఉంటే అందుకు బలమైన కారణాలను చూపించాలని సూచించడం ఆలోచింప‌జేస్తోంది.

మ‌రోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల‌పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ స్పందించారు.  పది, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి నిర్ణయం తీసుకుంటామన్నారు. న్యాయస్థానం ఏ నిర్ణయం చెప్పినా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

హైకోర్టు సూచ‌న‌తో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసిన‌ట్టు గ‌తంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చెప్పిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా ఉధృతి త‌గ్గిన త‌ర్వాత ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్షిస్తామ‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని విద్యాశాఖ మంత్రి చెబుతున్నారు.

న్యాయ‌స్థానాలు ఆదేశిస్తే త‌ప్ప‌, జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌రైన నిర్ణ‌యం తీసుకునే ప‌రిస్థితి లేదా? ప‌్ర‌తిదీ న్యాయ‌స్థానాల ఆదేశాల మేర‌కే పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునేట్టైతే, జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీని అధికారంలోకి తెచ్చుకోవ‌డం దేనికి? అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. వంద‌ల మంది స‌ల‌హాదారులు ఏం చేస్తున్న‌ట్టు? జ‌గ‌న్ ఏం వింటున్న‌ట్టు? అనే నిల‌దీత‌లు ఎదుర‌వు తున్నాయి. ఒక్కరు ప్రాణాలు కోల్పోయినా అందుకు మిమ్మల్ని బాధ్యులను చేస్తామని సుప్రీంకోర్టు హెచ్చ‌రించ‌డాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకోవాల్సిన అంశ‌మంటున్నారు.

టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేస్తే, ఆ క్రెడిట్ అంతా లోకేశ్‌కు వెళుతుంద‌నే ఏకైక అంశ‌మే జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అడ్డంకిగా మారింద‌నే అభిప్రాయాలున్నాయి. అందుకే మ‌రో ఆలోచ‌న లేకుండా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని ఏవేవో సాకులు వెతుక్కుంటోంద‌ని విద్యావేత్త‌లు మండిప‌డుతున్నారు. ఒక స‌మ‌స్య నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో మ‌రో దాంట్లో కూరుకుపోతోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

ఇప్ప‌టికైనా అన‌వ‌స‌ర ప‌ట్టింపుల‌కు వెళ్ల‌కుండా అంద‌రి మెప్పు పొందేలా స‌రైన నిర్ణ‌యం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఒక‌వేళ త‌న మొండి ప‌ట్టుద‌ల‌లో మార్పు లేద‌నుకుంటే సుప్రీంకోర్టు హెచ్చ‌రించిన‌ట్టు ….ఒక్క విద్యార్థికి కూడా ప్రాణ‌హాని జ‌రగ‌కుండా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అన్నిటికంటే పెద్ద ప‌రీక్షే అని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.