రానున్న రోజుల్లో అతి ముఖ్యమైన వనరుగా నీరు మారబోతోంది. తాగు నీరు లేక జనం అల్లల్లాడతారు. ముఖ్యంగా మహా నగరాలలో జనసమ్మర్ధం వల్ల నీటికి కటకట తప్పదు.
అటువంటి నగరాలలో విశాఖ కూడా ఉండబోతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం దాహార్తిని తీర్చేందుకు బృహత్తరమైన పధకాన్ని చేపట్టింది. 2050 వరకూ కూడా విశాఖలో నీటి కొరత అన్నది లేకుండా చూసేందుకు ప్రణాళికలను రూపొందించారు.
విశాఖకు ఏలేరు నుంచి పైపులైన్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీటిని సరఫరా చేసేందుకు మాస్టర్ ప్లాన్ ని రూపొందించారు. దీనికి మూడు వేల 339 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ రూరల్ జిల్లాల్తో పాటు నగరానికి కూడా 12 టీఎంసీల నీటిని తీసుకువచ్చేందుకు కార్యక్రమాన్ని తలపెట్టారు.
దీనికి సంబంధించిన డీపీయార్ ని తయారు చేస్తున్నారు. తొందరలోనే ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి మరో ముప్పయ్యేళ్ళ వరకూ విశాఖకు నీటి కడగండ్లు ఉండవన్న భరోసాను ఈ పధకం అందివ్వబోతోంది.