మంగళగిరికి మంగళం పాడేసిన లోకేష్?

చిత్తుచిత్తుగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మంగళగిరి వైపు కన్నెత్తి చూడడం మానేశారు లోకేష్. మంగళగిరినే తన నియోజకవర్గంగా కంటిన్యూ చేయాలనుకుంటే, 2024 ఎన్నికలే ఆయన టార్గెట్ అయ్యుంటే, కచ్చితంగా ఇప్పట్నుంచే ఓ కార్యాచరణ…

చిత్తుచిత్తుగా ఓడిపోయిన మరుసటి రోజు నుంచి మంగళగిరి వైపు కన్నెత్తి చూడడం మానేశారు లోకేష్. మంగళగిరినే తన నియోజకవర్గంగా కంటిన్యూ చేయాలనుకుంటే, 2024 ఎన్నికలే ఆయన టార్గెట్ అయ్యుంటే, కచ్చితంగా ఇప్పట్నుంచే ఓ కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలనే వ్యూహంతో మంగళగిరిలో ఫౌండేషన్ కోసం ప్రయత్నించాల్సి ఉంది. కానీ లోకేష్ ఎక్కడా అలాంటి ప్రయత్నాలు చేయలేదు, మంగళగిరి స్థానిక వ్యవహారాలే కాదు, అక్కడ పార్టీ విషయాల్లో కూడా ఆయన జోక్యం చేసుకోవడం లేదు. అంటే దాదాపుగా లోకేష్ మంగళగిరిని వదిలేసినట్టే లెక్క.

లోకేష్ సీక్రెట్ కమిటీలు..

వచ్చే ఎన్నికల నాటికి తనకు ఓ నమ్మకమైన నియోజకవర్గాన్ని వెదికే పనిని పార్టీలో కీలకమైన కొందరు నేతలకు అప్పగించారు లోకేష్. దీంతో పాటు తన టీమ్ లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు (సోషల్ మీడియా సెల్, ఎన్నారై విభాగం, ట్రస్ట్ భవన్, మీడియా వింగ్ )తో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. తనకు ఏ నియోజకవర్గం అయితే బాగుంటుందో కనిపెట్టాలని చెప్పారు. 

ఇటు లోకేష్ కమిటీ, అటు పార్టీ నేతలు ఇచ్చిన సూచనల ఆధారంగా కొత్త నియోజకవర్గంపై లోకేష్ ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. భీమిలి, పెనమలూరు నియోజకవర్గాలపై లోకేష్ కన్నుపడినట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈలోగా నియోజకవర్గాన్ని వెదుక్కుని అక్కడ ఫౌండేషన్ వేసుకోవాల్సిన అవసరం లోకేష్ కి ఎంతయినా ఉంది. తండ్రి కుప్పం వదలనంటున్నారు, మామ హిందూపురం ఇవ్వనంటున్నారు. 

అందుకే తప్పనిసరి పరిస్థితుల మధ్య, మరో కొత్త నియోజకవర్గం కోసం లోకేష్ కసరత్తు మొదలుపెట్టారు. మంగళగిరిలో మరోసారి పోటీ చేసినా, విజయం దక్కదని అర్థం కావడంతో తన టీమ్ ని రంగంలోకి దించి జల్లెడపడుతున్నారు.