పరువు నష్టం కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానాతో షాక్ ఇచ్చింది. పరువు నష్టం కేసులో పిటిషనర్‌కు రూ.2 కోట్లు చెల్లించాలని మాజీ ప్రధానిని కోర్టు ఆదేశించడం సంచలనం సృష్టించింది. 2011 జూన్ 28న ఓ కన్నడ వార్తా చానల్ ‘గౌడర గర్జనే’ శీర్షికతో దేవెగౌడ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది.
బీదర్ (దక్షిణ) మాజీ ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ ప్రైజెస్ (నైస్) పై దేవెగౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ సదరు సంస్థ ప్రతినిధులు కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.
నష్టపరిహారం కింద దేవెగౌడ నుంచి రూ.10 కోట్లు ఎన్‌ఐసీఈ కంపెనీ డిమాండ్ చేసింది. ప్రాజెక్టు కోసం అవసరమైన దాని కంటే ఎక్కువ భూమిని వినియోగించిందని గౌడ చేసిన ఆరోపణలు సరికాదని కంపెనీ తరపు న్యాయవాది వాదించారు.
ఇక ఇన్‌ఫ్రాస్ట్ర క్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్‌పై ఇంటర్వ్యూలో చేసిన తన ఆరోపణలు నిజమని నిరూపించడంలో దేవగౌడ విఫలయ్యారని కోర్టు తేల్చింది. అలాగే కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యంలో వాస్తవం ఉందని ఎనిమిదో సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి మల్లన గౌడ నిర్ధారించారు. ఆ కంపెనీకి నష్టపరిహారం కింద రూ.2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతించినట్లయితే, భవిష్యత్తులో ఇలాంటి భారీ ప్రాజెక్టులను అమలు చేయడం కష్టమవుతుందని కోర్టు తేల్చి చెప్పింది.