కార్టూన్‌తో చిత‌క్కొట్టిన జ‌న‌సేనాని

కార్టూన్‌తో ఏపీ ప్ర‌భుత్వాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాన్ చిత‌క్కొట్టారు. మ‌ద్య‌నిషేధంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేసింద‌నేది వాస్త‌వం. ఆ వాస్త‌వాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంగీక‌రించ‌దు. హామీల అమ‌లు త‌మ గొప్ప‌త‌న‌మని, చేయ‌ని వాటితో మాత్రం సంబంధం…

కార్టూన్‌తో ఏపీ ప్ర‌భుత్వాన్ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాన్ చిత‌క్కొట్టారు. మ‌ద్య‌నిషేధంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేసింద‌నేది వాస్త‌వం. ఆ వాస్త‌వాన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అంగీక‌రించ‌దు. హామీల అమ‌లు త‌మ గొప్ప‌త‌న‌మని, చేయ‌ని వాటితో మాత్రం సంబంధం లేద‌న్న‌ట్టు అధికార పార్టీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ స్వామి భ‌క్తిని ప్ర‌ద‌ర్శించే క్ర‌మంలో, కాస్త దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. అస‌లు మ‌ద్య‌నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని త‌మ మేనిఫెస్టోలో ఎక్క‌డుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించి ప్ర‌త్య‌ర్థుల‌కు ఆయుధాన్ని ఇచ్చారు.

ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కార్టూన్‌తో ప్ర‌భుత్వ వైఖ‌రిని దుమ్ముదులిపారు. మ‌ద్య నిషేధంపై ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేయ‌డాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ‘మద్యం మిథ్య. నిషేధం మిథ్య. తాగమని, తాగొద్దని అనడానికి మనమెవరం? అంతా వాడి ఇష్టం’ అనే క్యాప్షన్‌తో కార్టూన్‌ని పవన్ కల్యాణ్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఒకాయ‌న మేనిఫెస్టోను చేత‌ప‌ట్టుకుని వుంటే, మ‌రో మ‌హిళ ఎదురుగా నిలిచి వుంటుంది. మ‌ద్య‌నిషేధం అంతా జ‌గ‌న్ ఇష్టం అన్న సందేశాన్ని ఈ కార్టూన్ ద్వారా ప‌వ‌న్ చెప్ప‌ద‌లుచుకున్నారు.

‘మా మేనిఫెస్టోలో మ‌ద్య‌నిషేధం లేదుః మంత్రి  అమ‌ర్నాథ్’ అనే కామెంట్‌ను కార్టూన్‌కు జ‌త చేయ‌డం విశేషం. ఇటీవ‌ల జ‌గ‌న్ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై కార్టూన్‌ల ద్వారా ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో నిర‌స‌న ప్ర‌క‌టిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై కూడా ఆయ‌న వ్యంగ్య కార్టూన్ల‌తో వెట‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌ద్య‌నిషేధంపై ఆయ‌న సెటైర్ విసిరారు.

తాము అధికారంలోకి వ‌స్తే మ‌ద్య‌నిషేధాన్ని అమ‌లు చేస్తామ‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. హామీ అమ‌లు చేయ‌క పోగా పెద్ద ఎత్తున బార్ల‌కు అనుమ‌తులిచ్చి, మ‌రింత‌గా మందుబాబుల‌కు చేరువ చేయ‌డంపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుతున్నాయి. మాట త‌ప్ప‌ను, మ‌డ‌మ తిప్ప‌న‌నే జ‌గ‌న్‌… మ‌ద్య‌నిషేధంపై ఏం చెబుతార‌ని నిల‌దీస్తుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ముళ్ల క‌ర్ర‌తో పొడ‌వడానికి మ‌ద్య‌నిషేధం అంశాన్ని ప‌వ‌న్ ఆయుధం చేసుకున్నారు.