‘బాదుడే.. బాధలు’… అన్నీయిన్నీ కావయా?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తమ పథకాలకు మరింత ఆదరణ దక్కడం కోసం.. ప్రతి కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోవడం కోసం చాలా వ్యూహాత్మకంగా.. ‘గడపగడపకూ..’ కార్యక్రమాన్ని ప్రకటించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. తమ తమ…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తమ పథకాలకు మరింత ఆదరణ దక్కడం కోసం.. ప్రతి కుటుంబంతో అనుబంధాన్ని పెంచుకోవడం కోసం చాలా వ్యూహాత్మకంగా.. ‘గడపగడపకూ..’ కార్యక్రమాన్ని ప్రకటించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ.. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు కార్యక్రమాలను వివరించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఒక్కో కుటుంబానికీ.. ఈ ప్రభుత్వ హయాంలో ఏయే పథకాలు అందాయో, ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి చేకూరిందో చాలా స్పష్టంగా తెలియజెబుతూ వారు ముందుకు సాగుతున్నారు.

సర్కారు ఈ ‘గడప గడపకూ’కార్యక్రమాన్ని ప్రకటించిన వెంటనే.. చంద్రబాబునాయుడులో కంగారు పుట్టింది. అర్జంటుగా తాను కూడా ఏదోటి చేయాలని అనిపించింది. అధికారంలో ఉండగా నియోజకవర్గ ప్రజల మొహం చూసే అలవాటు లేని తమ సంస్కృతికి భిన్నంగా, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి ఇంటికీ తిరిగారంటే వారి జనాదరణ పీక్స్ కు వెళుతుందని భయపడ్డారు. అందుకే ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు ఇంటింటికీ తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రజల మీద ఎన్ని రకాలుగా అదనపు భారం పడుతున్నదో వారందరికీ తెలియజెప్పాలని పురమాయించారు. ఇదంతా తాను ఎప్పుడూ చేసే ‘బురద చల్లుడు’ కార్యక్రమమే గానీ.. దానిని ఏకకాలంలో క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ కాకపోయినా.. ప్రతి పల్లెలోనూ జరిగేలా చూడాలని ఆయన అనుకున్నారు. ప్రభుత్వం చేసే ‘గడపగడపకూ..’ కార్యక్రమానికి కౌంటర్ గా ‘బాదుడే బాదుడు’ జగన్ ను అపకీర్తి పాల్జేస్తుందని ఆయన భ్రమించారు.

అయితే.. అదంతా చంద్రబాబు అనుకున్నట్లుగా జరగలేదు. బాదుడే బాదుడు కార్యక్రమం కింద.. ప్రభుత్వంపై నిందలు వేస్తూ ప్రజల్లోకి వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ వారికే మొహం చెల్లడం లేదు. కొండొకచో పార్టీ ఒత్తిడి మేరకు కొన్ని చోట్ల నిర్వహించినా.. వారి విషప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదు. ‘బాదుడే బాదుడు’ అనే పేరు మీద ధరల పెంపును, చెత్త పన్నును, పెట్రోలు ధరల పెంపును కలిపి జగన్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలనేది చంద్రబాబు కోరిక. 

కానీ పెట్రోలు ధరలపెంపు అనేది కేంద్రం పరిధిలోని వ్యవహారం అని.. దాని వలన అన్ని రకాల ధరలు పెరుగుతాయనే విజ్ఞతను ప్రజలు కలిగి ఉన్నారు. పేద ప్రజల కోసం లక్షల కోట్ల రూపాయల సంక్షేమాన్ని అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వం చెత్త తీసుకువెళ్లడానికి విధించిన నామమాత్రపు రుసుము.. ఎవ్వరికీ పెద్ద ఇబ్బందికరంగా కనిపించడం లేదు. చంద్రబాబు ‘బాదుడే బాదుడు’ ప్రహసన ప్రాయంగా తయారైంది.

ఇంటింటికీ కాదు సరికదా.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనైనా తెలుగుదేశం కార్యక్రమం జరుగుతోందా లేదా అన్నట్టుగా తయారైంది. జిల్లాలు, నియోజకవర్గాల్లోని పార్టీ నాయకులతో ఫోను సమీక్షల సమయంలో.. బాదుడే బాదుడును ముందుకు తీసుకువెళ్లాలని, ఎక్కడా ఇది సరిగా జరగడం లేదని చంద్రబాబు వాపోవడం గమనిస్తే.. ఆయన మీద జాలి కలుగుతోంది. 

నిజాయితీ లేకుండా, కేవలం జగన్ మీద విషం చిమ్మడం కోసం ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తే పరువు పోవడం తప్ప మరో లాభం లేదని చంద్రబాబు గ్రహిస్తే ఆయనకే మంచిది. ముందు ముందు నిజంగా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటాలుచేస్తే.. ప్రజలకూ మేలు జరుగుతుంది. ఆయన పార్టీ కూడా మనుగడ సాగిస్తుంది.