జ‌గ‌న్‌పై మెగాస్టార్ ప్ర‌శంస‌ల మ‌ర్మ‌మేంటో?

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినందించారు. చిరంజీవి ప్ర‌శంస‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కార్‌తో పాటు వైసీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో వైసీపీ త‌ర‌పున చిరంజీవి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వుతార‌నే…

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినందించారు. చిరంజీవి ప్ర‌శంస‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కార్‌తో పాటు వైసీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో వైసీపీ త‌ర‌పున చిరంజీవి రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

రెండు రోజుల క్రితం ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించింది. ఈ సందర్భంగా ఆదివారం ఒక్క రోజే 13.72 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేసి జ‌గ‌న్ ప్ర‌భుత్వం రికార్డు సృష్టించింది. 

వాస్త‌వానికి ఆ రోజు 8 ల‌క్ష‌ల మందికి వ్యాక్సిన్ వేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ల‌క్ష్యాన్ని మించి అత్య‌ధికంగా వ్యాక్సిన్ వేయ‌డం స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఈ నేప‌థ్యంలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేష‌న్ నిర్వ‌హించిన జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట‌ర్ వేదిక‌గా మెచ్చుకున్నారు. కోవిడ్ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి కోసం ఏపీ వైద్యారోగ్య‌శాఖ చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు.

కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చిరంజీవి కొనియాడారు. ఆదర్శవంత మైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. 

గ‌తంలో కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వివిధ సంద‌ర్భాల్లో చేప‌ట్టిన మంచి ప‌నుల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చిరంజీవి అభినందించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు జ‌గ‌న్ స‌ర్కార్‌పై చిరంజీవి ప్ర‌శంస‌ల వెనుక మ‌ర్మ‌మేంటో అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.