పశ్చిమబెంగాల్ కేసుల విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానంలో వింత పరిస్థితి నెలకుంది. కేసులను విచారించ లేమంటూ ఆ రాష్ట్రానికి చెందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తప్పుకుంటుండం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
తాజాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన నారదా కుంభకోణానికి సంబంధించి ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వేసిన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధా బోస్ తప్పుకోవడంతో చర్చకు తెరలేపింది.
జస్టిస్ అనిరుద్ధా బోస్ స్వస్థలం కోల్‌కతా. దీంతో సొంత రాష్ట్రానికి సంబంధించిన ఈ కేసులో వాదనలు వినాలనుకోవడం లేదని ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత గుప్తా సుప్రీంకోర్టు రిజిస్ట్రీని కోరారు.
ఇదే సందర్భంలో మరో కేసులో కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల అనంతరం హింస చెలరేగిందని, బీజేపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున మమతాబెనర్జీ ప్రభుత్వం దాడులకు తెగబడిందనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై న్యాయస్థానం స్పందించాల్సి వచ్చింది.
ఎన్నికల అనంతరం చెలరేగిన హింసకు సంబంధించిన కేసు విచారణ నుంచి జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇటీవలే తప్పుకోవడం న్యాయ వ్యవస్థలో చోటు చేసుకున్న ఆసక్తి పరిణామంగా చెప్పొచ్చు. ఈమె కూడా కోల్‌కతాకు చెందినవారే.
ఇలా సొంత రాష్ట్రం కేసులైతే విచారించలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ స్థాయిలో తప్పుకోవడం గతంలో ఎప్పుడూ లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.