తాత క్యారెక్టర్.. నెరసిన జుట్టు.. మాసిన గడ్డం. సాదా సీదా దుస్తులు.. మందపాటి కళ్లద్దాలు.. ఇదీ జైలర్ సినిమాలో సూపర్ స్టార్ రజనీ గెటప్. పైగా ఓ పాట లేదు. పక్కన హీరోయిన్ లేదు. ఈ గెటప్ లో మన మెగాస్టార్ లు, కింగ్ లు ఇంకెవరైనా ఎప్పటికైనా కనిపించగలరా? ఆ ధైర్యం చేయగలరా?
అరవైలు దాటేసినా, డెభైలు వచ్చేసినా మనకు ఇంకా కుర్ర హీరోయిన్లు పక్కన వుండాలి. ఐటమ్ సాంగ్ కావాల్సిందే. విగ్గులు, హెయిర్ వీవింగ్ లు చేయించుకుని కుర్రకారులా ముస్తాబు కావాల్సిందే. సిజి వర్క్ లకు కోట్లకు కోట్లు ఖర్చు చేసి వృద్ద హీరొలను అందంగా చూపించాల్సిందే.
సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసినా, కోట్లకు కోట్లు రెమ్యూనిరేషన్లు మన నిర్మాతలు వెంటపడి మరీ ఇస్తూనే వుంటారు. రొటీన్ రొట్ట సినిమాలు తీస్తూనే వుంటారు తప్ప, కొత్తగా ప్రయత్నం అన్నది చేయరు. పైగా దీనికి ఓ సాకు కూడా వుంది. అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తున్నాం అంటారు. ఏ హీరోతో చేస్తే, ఆ హీరో కు తాను డై హార్డ్ ఫ్యాన్ అని, అందుకే తను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే చూపిస్తున్నా అంటూ దర్శకులు సోప్ వేస్తుంటారు.
ఈ మాయాజాలంలో ఇలా రొటీన్ సినిమాలు వస్తూనే వుంటాయి. మన ఆడియన్స్ వాటిని నిర్మొహమాటంగా తిరగ్గొట్టి, ఇతర భాషల నుంచి వస్తున్న మంచి సినిమాలు ఎంచుకుని నెత్తిన పెట్టుకుంటారు. అయితే థియేటర్ లో లేదా ఓటిటి లో వాటిని చూస్తూ వుంటారు. అది తెలిసి కూడా మన హీరోలు మాత్రం మారరు. హీరోయిన్ లేకుండా, పాటలు లేకుండా సినిమా చేసే ధైర్యం మన సీనియర్ హీరోలకు మరో పదేళ్లు పడుతుందేమో?
గమ్మత్తేమిటంటే ఈ హీరోలంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే వుంటారు. కానీ అక్కడ జనాలు చేస్తున్న కామెంట్ లు మాత్రం చూడరు. ఈ రొటీన్ రొట్ట సినిమాలు వద్దు బాబూ అంటూ పెడుతున్న కామెంట్లు వీళ్లకు కనిపించవు. అయితే తమకు సరిపడా రీమేక్ లు వెదుక్కోవడం లేదా అంటే అయిదు పాటలు, నాలుగు ఫైట్లు, ఒక హీరొయిన్, ఒక ఐటమ్ గాళ్ ఇలా ఫార్ములా సినిమాలు చేయడం.
ఒక నిర్మాత కుదేలై కోట్లు పొగొట్టుకుంటే మరో నిర్మాత వస్తారు. అదే ఈ సీనియర్లకు వరం. అదే టాలీవుడ్ సినిమా అభిమానులకు శాపం.