చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ ను సిటీ సివిల్ కోర్టు కొట్టేసినట్టు కథనాలు వచ్చాయి. అయితే వీటిపై పూర్తి వివరణ ఇచ్చారు పిటిషనర్, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్. భోళాశంకర్ విడుదలకు మాత్రమే మార్గం సుగమం అయిందని, కేసుకు సంబంధించి పిటిషన్ ను పూర్తిగా కొట్టేయలేదని ఆయన చెబుతున్నారు. అంతేకాదు, ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టుకు వెళ్లబోతున్నట్టు స్పష్టం చేశారు.
ఏజెంట్ సినిమాకు సంబంధించి ఏకే ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాతలు తన దగ్గర బ్యాంకు లావాదేవీల రూపంలో 30 కోట్లు తీసుకుని, తనకు రాసిచ్చిన అగ్రిమెంట్ ను అమలుపరచకుండా మోసం చేశారని సతీష్ కేసు వేసిన సంగతి తెలిసిందే. తనకు డబ్బులు చెల్లించేంతవరకు భోళా శంకర్ సినిమా విడుదలను అన్ని ఫ్లాట్ ఫార్మ్స్ లో నిలుపుదల చేయాలని, సిటీ సివిల్ కోర్టులో 5 ఐ.ఎ.లు వేశారు.
వీటిలో నాలుగింటిని సిటీ సివిల్ కోర్టు కొట్టేసింది. ఒకటి మాత్రం పెండింగ్ లో పెట్టింది. అది భోళాశంకర్ డిజిటల్ రైట్స్ కు సంబంధించి ఐఏ అని సతీష్ చెబుతున్నారు. ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు కోర్టు ఆర్డర్ కాపీ రాలేదంట. శుక్రవారం సాయంత్రానికి కోర్టు ఆర్డర్ కాపీ వస్తుందని, అందులో పూర్తి వివరాలు ఉంటాయని అంటున్నారు.
సతీష్ మాత్రం ఈ కేసును కొనసాగిస్తామని చెబుతున్నారు. కోర్టు ద్వారా తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, కోర్టు ఆర్డర్ కాపీ అందగానే హైకోర్టుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణ సెప్టెంబర్ 13న జరగనుంది.