కేంద్రంలోని మోడీ సర్కారు అనేక విషయాల్లో నియంతృత్వ పోకడలను అనుసరిస్తోందనే ఆరోపణలు తొలినుంచి పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలు, ప్రచారం నిజమేనేమో అనిపించేలా చాలా విషయాల్లో వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా కేంద్రప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన ఒక బిల్లు.. కేంద్రం నియంతృత్వపోకడలపై ఎంతగా మక్కువ చూపిస్తోందో తేటతెల్లం చేస్తోంది.
దేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ లను నియమించే అధికారంలో.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పాత్ర లేకుండా.. కేంద్రం ఒక బిల్లు తీసుకువచ్చింది. ఆ బిల్లు పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు ప్రధానమంత్రి నేతృత్వంలో విపక్ష నాయకుడితోపాటు, సీజేఐ కూడా ఉండే త్రిసభ్య కమిటీ నియామకాలు చేయాలని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. అంతకుముందు కేంద్రప్రభుత్వ సిఫారసు మేరకు రాష్ట్రపతి ఈ నియామకాలు చేసేవారు. సుప్రీం కోర్టు తీర్వాత అధికార ప్రతిపక్ష పార్టీ నేతలతో తటస్థ వ్యక్తి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కూడా కలిసి నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ వచ్చింది.
అయితే తాజాగా కేంద్రం కొత్తగా పార్లమెంటులో ఒక బిల్లు ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సీఈసీ, ఈసీ ల నియామకానికి ప్రధాని నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటవుతుంది. ఇందులో లోక్ సభ విపక్ష నేత, ప్రధాని నియమించే ఒక కేబినెట్ మంత్రి ఉంటారు. అంటే ముగ్గరిలో ఇద్దరు అధికార పార్టీ వారే ఉంటారన్నమాట. అంతిమంగా.. ప్రధాని ఎవరిని తలచుకుంటే వారిని సీఈసీ, ఈసీ స్థానాల్లో కూర్చోబెట్టగల వాతావరణమే ఏర్పడుతుంది. ఈ బిల్లు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేసేలా ఉన్నదనే విమర్శలు వస్తున్నాయి. నియంతృత్వ పోకడలను పెంచుతాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ పాత్రలు ఎంత కీలకమైనవో అందరికీ తెలుసు. ఎన్నికలు జరిగే సీజన్ వచ్చిన తర్వాత, ప్రధాని- ముఖ్యమంత్రి కంటె కీలకమైన అధికారాలు మొత్తం ఈ స్థానాల్లో ఉన్నవారికే దఖలుపడతాయి. ఎన్నికలను నిజాయితీగా, పారదర్శకంగా నిర్వహించడం అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిజాయితీ, చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది.
అలాంటిది.. అధికార పార్టీకి అనుకూలమైన రాజకీయ నియామకాలుగా ఈ వ్యవస్థలను కూడా మార్చేయడం పట్ల విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికే మోడీ సర్కారు కేంద్ర దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా వాడుకుంటున్నదనే విమర్శలు దండిగా ఉన్నాయి. తాజాగా ఎన్నికల నిర్వహణ వ్యవస్థలను కూడా సర్కారు తమ గుప్పిట పెట్టుకోవాలని అనుకుంటున్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది.