పోగొట్టుకున్న చోటే వెతుక్కోవడం విజ్ఞుల లక్షణం. ఉన్నది పోగొట్టుకోవడం మూర్ఖుల స్వభావం. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులే అంతిమంగా విజయాన్ని ఇస్తాయి. రాజకీయాల్లోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు, సుఖదుఃఖాలు శాశ్వతం కాదు. వాటిని నిలుపుకోవడం ఆయా వ్యక్తుల తెలివితేటలపై ఆధారపడి ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే ….2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే ప్రాంతీయ తేడాలు లేకుండా మూడు వైపులా వైసీపీ తిరుగులేని ఆధిక్యతను కనబరిచింది. కాకపోతే రాయలసీమకు వస్తే ….కాస్త ఎక్కువ పరాభవాన్ని నాటి అధికార పక్షం టీడీపీ మూటకట్టుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా రాయలసీమలో టీడీపీ కంటే వైసీపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. రాయలసీమ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతి నిథ్యం వహిస్తుండడం గమనార్హం. కానీ మానసికంగా చంద్రబాబు సీమేతరుడే.
రాయలసీమలో 52 ఎమ్మెల్యే స్థానాలకు గాను కేవలం మూడంటే మూడే అసెంబ్లీ సీట్లలో టీడీపీ గెలుపొందింది. గెలిచిన వాటిలో చంద్రబాబు పోటీ చేసిన కుప్పం, ఆయన బామ్మర్ది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం, అలాగే ఉరవ కొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. ముగ్గురూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం మరో గమనించాల్సిన అంశం. ఇక 8 పార్లమెంట్ స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది.
రాయలసీమలో టీడీపీ మరీ ఘోరంగా పరాజయం పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్న చందంగా, సీమలో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడానికి ఆ పార్టీ స్వీయ తప్పిదాలే కారణమని చెప్పక తప్పదు. రాయలసీమపై ప్రధానంగా సాగుతున్న సాంస్కృతిక, సామాజిక దాడికి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్నారు. అలాగే బాబు పాలనలో సీమను సవతి బిడ్డలా చూసుకోవడంతో, ఆ ప్రాంత ప్రజానీకంలో వ్యతిరేకత పెరగడానికి దోహదం చేసింది.
శ్రీబాగ్ ఒప్పందానికి విరుద్ధంగా, సీమ ప్రజానీకం ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో సహజంగానే ఆ ప్రాంతంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాకుండా, రాయలసీమకు కనీసం హైకోర్టు అయినా ఇవ్వాలనే ఆ ప్రాంత ప్రజానీకం డిమాండ్‌ను చంద్రబాబు పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల టీడీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతూ పోయింది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలను గాలికి వదిలేసి…అభివృద్ధి అంతా తన అత్తగారి ప్రాంతమైన అమరావతిలో చేస్తున్నారనే భావన కూడా బాబుపై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం.
ఎడారిని తలపిస్తున్న రాయలసీమను కరువు రక్కసికి వదిలేసి, కృష్ణా జిల్లాకు తాత్కాలిక సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టిసీమను యుద్ధప్రాతిపదికన నిర్మించడం …రాయలసీమ పాలిట పుండు మీద కారం చల్లినట్టైంది. దీంతో సమయం కోసం వేచి చూసిన రాయలసీమ …గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని చావు దెబ్బతీసింది. చివరికి రాజధాని ఇచ్చిన కోస్తా ప్రాంతం కూడా టీడీపీని అక్కున చేర్చుకోకపోవడం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం.
ఈ నేపథ్యంలో రాయలసీమ ఆదరణను తిరిగి పొందగలిగితే తప్ప అధికారానికి చేరువ కాలేమని టీడీపీ అధినేత చంద్రబాబు గ్రహించారు. ఈ క్రమంలో రాయలసీమ ఉద్యమకారులు, ప్రజాసంఘాల ప్రతినిధులతో చర్చించి, ఆ ప్రాంత సమస్యల పరిష్కా రానికి తామేం చేయాలనే అంశంపై కార్యాచరణకు టీడీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీమకు చెందిన యువ ఉద్యమకారులతో ఆన్‌లైన్‌లో చర్చించారు. టీడీపీలో వచ్చిన మార్పునకు ఇది తొలి సంకేతం.
సీమ ఉద్యమకారులతో సమావేశం కావడంపై ఆ ప్రాంతం నుంచి సానుకూల స్పందన రావడంతో , ఈ సారి చంద్రబాబే రంగంలోకి దిగనున్నారని సమాచారం. రాయలసీమ సమస్యలపై వివిధ వేదికల నుంచి బలమైన గొంతుకు వినిపిస్తున్న నేతలు, ఉద్యమ కారులతో చంద్రబాబు రెండుమూడురోజుల్లో సమావేశం అయ్యేందుకు సమాయత్తం అవుతున్నారని తెలిసింది. సీమ బద్ధ వ్యతిరేకిగా ముద్రపడిన చంద్రబాబులో ఈ మార్పునకు …ఆ ప్రాంత చైతన్యమే నిదర్శనమని చెప్పక తప్పదు. బాబులో వస్తున్న మార్పును సీమ సమాజం ఆహ్వానిస్తోంది.
మరోవైపు రాయలసీమ అంటే తమ జాగీరుగా అధికార వైసీపీ భావిస్తోందని చెప్పక తప్పదు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని సీమలో ఉనికే లేకుండా చేయడంతో, ఇక ఆ ప్రాంతం తమ చెప్పు చేతుల్లో ఉన్నట్టు వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా రాయలసీమ సాగు, తాగునీటి సమస్యలపై కనీసం సీఎంతో చర్చించేం దుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే ఆక్రోశం ఆ ప్రాంత ఉద్యమకారుల్లో బలంగా ఉంది. పైగా సీమ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారయ్యాయి.
సీమ ప్రాజెక్టులకు సంబంధించి కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడని దయనీయ స్థితి. సీమ ముద్దుబిడ్డ, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే …సీమ సస్యశ్యామలం అవుతుందని ఆ ప్రాంతం ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. కాలం గడిచే కొద్ది జగన్‌పై సీమ ప్రజానీకంలో నమ్మకం సడులుతోంది. పైగా ఎగ్జిక్యూటివ్ రాజధాని కర్నూల్ కాదని విశాఖకు తరలించడం, అలాగే కృష్ణా నదీయాజమాన్య బోర్డును కూడా ఏ మాత్రం సంబంధం లేని అదే వైజాగ్‌కు తరలించడంపై సీమ ఆగ్రహంతో ఉంది. తమ మనోభావాలకు విరుద్ధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆవేదన ఆ ప్రాంత ప్రజానీకంలో బలంగా ఉంది.
అప్పుడైనా, ఇప్పుడైనా సీమ వాసులే పాలక ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పటికీ తమకు ఒరిగిందేమీ లేదని సీమ సమాజం ఆవేదనతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలో సీమలో వ్యతిరేకతను తగ్గించుకోడానికి చంద్రబాబు ముందుకు రావడంపై ఆ ప్రాంత ఉద్యమకారులు సానుకూలంగా స్పందిస్తున్నారు. తమ ప్రాంత సమస్యలపై బాబు సానుకూల వైఖరి తీసుకుంటే తప్పక ఆహ్వానిస్తామని సీమ ఉద్యమకారులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రం సామాజిక, రాజకీయ అంశాల రీత్యా సీమను పట్టించుకోకపోయినా, పెద్దగా నష్టపోమనే భావనలో ఉన్నట్టు కనిపిస్తోంది. రానున్న మూడేళ్ల పాలనలో సీమ ఆకాంక్షల విషయంలో జగన్ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆ ప్రాంతం బలంగా విశ్వసిస్తోంది. మరోవైపు ఎలాగైనా సీమలో పాగా వేసి పూర్వ వైభవాన్ని సాధించాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో సీమ మనసు గెలుచుకునేదెవరు? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.